Mahaa Daily Exclusive

  దోషులను కఠినంగా శిక్షించాలి..! అయోధ్య విరాళాల వివాదంపై ఆర్ఎస్ఎస్ తీవ్ర ఆవేదన..

Share

ఢిల్లీ, మహా.

అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరంలోని హుండీల నుంచి విరాళాలు అపహరణకు గురైన ఘటనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటన కోట్లాది మంది రామభక్తుల విశ్వాసాన్ని, హిందూ సమాజ మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని పేర్కొంది. ఈ వ్యవహారంపై ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే శుక్రవారం న్యూఢిల్లీ నుంచి ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ దొంగతనానికి పాల్పడిన దోషులను గుర్తించి, అత్యంత కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఆలయ నిర్వహణలోని లోపాలను తక్షణమే సరిదిద్దుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సూచించారు.

**కుట్రలను ఐకమత్యంతో తిప్పికొట్టాలి..**

హుండీ చోరీ ఘటన తమకు ఎంతో ఆవేదన, ఆగ్రహం కలిగించిందని దత్తాత్రేయ హోసబలే ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఈ దురదృష్టకరమైన సంఘటనను ఆసరాగా చేసుకుని హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు యత్నిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఈ వివాదాన్ని ఒక అస్త్రంగా మలచుకుని, యావత్ హిందూ సమాజంపైన, సనాతన ధర్మంపైన బురద జల్లేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో హిందూ సమాజమంతా సంయమనం పాటించాలని, ఆ దుష్ట శక్తుల తప్పుడు ప్రచారాలను నమ్మకుండా ఐకమత్యంతో వారి కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్రస్ట్‌పై పూర్తి నమ్మకం ఉంది..

అయోధ్యలో భవ్య రామమందిరం అనేది ఎన్నో తరాల సుదీర్ఘ పోరాటాలు, కోట్లాది మంది భక్తుల త్యాగాల పునాదుల మీద నిర్మితమైందని హోసబలే గుర్తుచేశారు. ఈ కష్టసమయంలో ప్రతి ఒక్కరూ ఓపిక, నిగ్రహం ప్రదర్శించడం అత్యంత ఆవశ్యకమన్నారు. భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తూ, మున్ముందు ఇలాంటి అపశ్రుతులు చోటుచేసుకోకుండా ఆలయ ట్రస్ట్ పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకుంటుందన్న సంపూర్ణ నమ్మకం తనకు ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest