- రెండు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఏటీఎస్ దాడులు.. ఎనిమిది మంది అరెస్టు.
గాంధీనగర్,మహా.
గుజరాత్ వేదికగా భారీ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ‘జైష్-ఎ-మహ్మద్’ (జేఈఎం) పన్నిన ముఠా కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు విజయవంతంగా భగ్నం చేశారు. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించిన ఏటీఎస్ బృందాలు ఎనిమిది మంది అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నాయి. గురువారం గుజరాత్‌లోని బనస్కాంత, పటాన్, నవ్సారి జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని దేవాస్ ప్రాంతంలో ఈ విస్తృత తనిఖీలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
అరెస్టయిన నిందితులను అహ్మద్ గాజీవాలా, ఇబ్రహీం ఘాఘా, ముదస్సిర్ గాజీవాలా, జకారియా దురానీ, ముఫ్తీ ఫౌజాన్ దౌవా, మహ్మద్ అమీన్ పాలన్‌పురి, మహ్మద్ అబ్దుల్ సావ్దీ, బిలాల్ దురానీ ఘాఘాగా అధికారులు గుర్తించారు. వీరిలో ముగ్గురు నిందితులకు సిద్ధ్‌పూర్, చిఖ్లీ ప్రాంతాల్లోని కొన్ని మతపరమైన విద్యాసంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితులంతా జైష్-ఎ-మహ్మద్ ఉగ్ర సంస్థ తరఫున స్లీపర్ సెల్స్‌లా అత్యంత చురుగ్గా పనిచేస్తున్నారని, గుజరాత్ వ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను విస్తరించి దేశ భద్రతకు భంగం కలిగించడమే వీరి ప్రధాన లక్ష్యమని ఏటీఎస్ వర్గాలు స్పష్టం చేశాయి.
రాష్ట్రంలోని యువతను తప్పుదోవ పట్టించి ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లించేందుకు, దేశ వ్యతిరేక శక్తుల బలోపేతానికి వీరు పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్లు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు విచారణలో వెల్లడైంది. అరెస్టయిన వారిపై ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కఠిన కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుల స్థావరాల నుంచి పలు డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉగ్ర నెట్‌వర్క్‌కు దేశవ్యాప్తంగా మరే ఇతర రాష్ట్రాల్లోనైనా సంబంధాలు ఉన్నాయా, వీరికి అందుతున్న ఆర్థిక వనరుల మూలాలు ఎక్కడున్నాయనే కోణంలో దర్యాప్తు సంస్థలు విచారణను తీవ్రతరం చేశాయి.








