Mahaa Daily Exclusive

  రాయలసీమను ఇకపై ‘ఉక్కుసీమ’గా మారుస్తాం..! జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు..

Share

  • ఆడబిడ్డల జోలికొస్తే అసాంఘిక శక్తులకు అదే ఆఖరి రోజు.
  •  జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు.

కడప,మహా.

ఆంధ్రప్రదేశ్‌ను సరికొత్త పారిశ్రామిక హబ్‌గా, ముఖ్యంగా దేశంలోనే ఒక ‘స్టీల్ స్టేట్’గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్న ప్రతిష్టాత్మక ‘జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్’ నిర్మాణ పనులకు ఆయన లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. కేవలం విశాఖపట్నం మాత్రమే కాకుండా, ఇకపై రాయలసీమ ప్రాంతాన్ని కూడా ‘ఉక్కుసీమ’గా మారుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రీన్ స్టీల్‌ను ఉత్పత్తి చేసే భారీ ప్లాంట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుండటం గర్వకారణమన్నారు.

**ఐరన్ ఓర్‌ను దోచుకున్నారు..**

స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో గత పాలకులు ఐరన్ ఓర్‌ను అక్రమంగా దోచుకుంటూ పెద్ద ఎత్తున స్మగ్లింగ్‌కు పాల్పడ్డారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే రాయలసీమ ప్రాంతానికి రూ.4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకురాగలిగామని ఆయన స్పష్టం చేశారు. స్థానికంగా భారీ పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఇక్కడి యువతకు తమ సొంత గడ్డపైనే ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు గతంలో కియా మోటార్స్ పరిశ్రమను తీసుకురావడం వల్ల ఆ ప్రాంత రూపురేఖలే పూర్తిగా మారిపోయాయని, ఇప్పటివరకూ అక్కడ 19 లక్షల కార్లు తయారయ్యాయని ఆయన గుర్తుచేశారు. రాయలసీమకు వాస్తవంగా ఎవరి వల్ల నష్టం జరిగింది, ఎవరి హయాంలో మేలు జరిగిందో ప్రజలు చరిత్రను బేరీజు వేసుకోవాలని కోరారు.

**సీమలో పారాల్సింది రక్తం కాదు.. సాగునీరు..**

ఒకప్పుడు రాయలసీమలో రాజ్యమేలిన ఫ్యాక్షన్ సంస్కృతిని తమ ప్రభుత్వమే అంతం చేసిందని చంద్రబాబు స్పష్టం చేశారు. సీమ గడ్డపై పారాల్సింది రక్తం కాదని, సాగునీరు అని ఆయన ఉద్ఘాటించారు. ఫ్యాక్షనిజం పోయినప్పటికీ, నేర చరిత్ర ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం విధ్వంసమే అజెండాగా పెట్టుకున్న ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏమాత్రం మేలు చేయలేరని పరోక్షంగా జగన్‌ను విమర్శించారు. 2014లో అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారని, కానీ గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ నవ్వులపాలు చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు మావిగన్, విజయవాడ అంటూ మతిస్థిమితం లేని వ్యక్తిలా మాట్లాడుతున్నారని, రేపు ఇంకేమంటారో తెలియని విచిత్ర పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు.

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం..

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. రాష్ట్రంలో రౌడీ మూకలు, గంజాయి బ్యాచ్‌లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా నిలుస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసే ఇలాంటి అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని చంద్రబాబు నాయుడు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

Latest