- మతం స్వీకరించేందుకు ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం లేదు.
- మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.
చెన్నై, మహా.
విదేశీ పేరు, పౌరసత్వం ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తికి హిందూ గుర్తింపును నిరాకరించలేమని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఒక వ్యక్తి మనఃస్ఫూర్తిగా హిందూ మతాన్ని స్వీకరించడానికి ఎలాంటి సర్టిఫికెట్లు, ప్రత్యేక అధికారిక వేడుకలు అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అమెరికా పౌరురాలు లారా ఫ్రాన్సెస్ అయ్యంగార్‌ను ‘అమెరికన్ క్రైస్తవ మహిళ’గా పరిగణిస్తూ తమిళనాడు దేవాదాయ శాఖ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుబడుతూ కొట్టివేసింది. లారా ఫ్రాన్సెస్‌ను పూర్తిగా హిందూ భక్తురాలిగానే పరిగణించాలని అధికారులను ఆదేశించింది.
ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశీయులు అనగానే వారిని క్రైస్తవులుగా లేదా ఇతర మతస్థులుగా అంచనా వేయడం ముమ్మాటికీ తప్పని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒక వ్యక్తి మనఃస్ఫూర్తిగా మతాన్ని ఆచరిస్తూ, సనాతన హిందూ జీవన విధానాన్ని పాటిస్తే వారిని నిస్సందేహంగా హిందువులుగానే అంగీకరించాలని తేల్చిచెప్పింది. కేవలం వారి పేరు, పుట్టిన దేశం, పాస్‌పోర్ట్ ఆధారంగా భక్తిని, విశ్వాసాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ చారిత్రక తీర్పుతో లారా ఫ్రాన్సెస్‌కు తంజావూరు ఆలయంలో హిందూ మహిళలకు ఉండే అన్ని రకాల పూజా, దర్శన హక్కులు యథాతథంగా వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఆగమ శాస్త్రాలు, ఆలయ నిబంధనలకు లోబడి ఆ విదేశీ హిందూ భక్తురాలికి ఇతర భక్తులతో సమానంగా ఆలయ ప్రవేశం, ఇతర హక్కులు కల్పించాల్సిందేనని తమిళనాడు ప్రభుత్వానికి, దేవాదాయ శాఖ అధికారులకు మద్రాస్ హైకోర్టు హుకుం జారీ చేసింది.








