Mahaa Daily Exclusive

  తోతాపురి రైతులకు కేంద్రం అండ..!

Share

  •  సమస్యల పరిష్కారానికి నిపుణుల కమిటీ ఏర్పాటు.
  •  ధరల పతనంపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక.

ఢిల్లీ, మహా.

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న తోతాపురి మామిడి రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వారి కష్టాలను గట్టెక్కించే దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించడంతో పాటు, మామిడి ధరలు అమాంతం పడిపోవడానికి గల కారణాలను లోతుగా విశ్లేషించేందుకు భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని కేంద్ర వ్యవసాయ శాఖ తాజాగా ఏర్పాటు చేసింది.

ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. తోతాపురి రైతులు ఎదుర్కొంటున్న దుస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. దిగుబడులు చేతికొచ్చినప్పటికీ, మార్కెట్‌లో ధరలు దారుణంగా పతనమవడంతో తాము తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నామని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో వెంటనే ఈ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.

కేంద్రం ఏర్పాటు చేసిన ఈ కమిటీ రాబోయే పది రోజుల్లో రాష్ట్రంలో తోతాపురి మామిడి సాగు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనుంది. సాగు మొదలుకొని ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, దేశీయ విక్రయాలతో పాటు ఎగుమతుల వరకు ఉన్న మొత్తం వ్యవస్థను ఈ బృందం క్షుణ్ణంగా సమీక్షించనుంది. తమ పర్యటనలో భాగంగా రైతులు, ప్రాసెసింగ్‌ పరిశ్రమల ప్రతినిధులు, ఎగుమతిదారులు, ఉద్యాన శాఖ అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో ఈ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. వారి అభిప్రాయాలను, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకోనుంది.

ప్రధానంగా మామిడి సాగు వ్యయం, రైతుల ఆదాయం, పరిశ్రమల ప్రాసెసింగ్‌ సామర్థ్యం, మార్కెట్‌లో డిమాండ్‌-సరఫరా పరిస్థితులు ఎలా ఉన్నాయన్న కోణంలో కమిటీ బృందం అధ్యయనం చేయనుంది. ముఖ్యంగా దేశీయ, విదేశీ మార్కెట్లలో తోతాపురి ధరలు పడిపోవడానికి గల మూల కారణాలను పరిశీలించనుంది. ఈ విస్తృత స్థాయి విశ్లేషణల అనంతరం రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడటంతో పాటు, భవిష్యత్తులో ఈ రంగాన్ని దీర్ఘకాలికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వానికి ఈ కమిటీ ఒక సమగ్ర నివేదికను అందజేయనుంది.

Latest