పినపాక నియోజకవర్గంలో వైద్య సేవలు మెరుగుపరచాలి
: మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వినతి
హైదరాబాద్, మహా
పినపాక నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో, నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కీలక వినతిపత్రాలను సమర్పించారు. మణుగూరు ఏరియా ఆసుపత్రిపై ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోందని, పడకల వినియోగం 130 శాతానికి మించిందని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న 100 పడకల ఆసుపత్రిని 150 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని, అదనంగా 50 పడకల వార్డును ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల ఐసీయూ సేవలు, అత్యవసర చికిత్సలు గిరిజన ప్రాంత ప్రజలకు మరింత చేరువవుతాయని ఆయన వివరించారు. గుండాల మండలం పూర్తిగా గిరిజన, అటవీ ప్రాంతమని, సమీప ఆసుపత్రులు సుమారు 60 నుంచి 78 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కావున, గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మార్చాలని కోరారు. ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవసరమైన మందులు, మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే, నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమర్పించిన వినతులపై మంత్రి దామోదర రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. మణుగూరు ఆసుపత్రి అప్‌గ్రేడేషన్, గుండాలలో సీహెచ్‌సీ ఏర్పాటు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుందని, తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు వెల్లడించారు.
—








