- తప్పులు కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతల ఎదురుదాడి.
- అసత్య ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫైర్.
హైదరాబాద్, మహా.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, ఆ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే నేడు ప్రజా ప్రభుత్వంపై వారు ఎదురుదాడికి దిగుతున్నారని ధ్వజమెత్తారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల తీరును, వారు చేస్తున్న ఆరోపణలను ఎండగట్టారు. పదేళ్ల పాటు అబద్ధాల పునాదులపై పాలన సాగించిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చెప్పే అబద్ధాలు ప్రజల్లోకి వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే తాము స్పందిస్తున్నామని, నిశ్శబ్దంగా ఉంటే వ్యవస్థలకు నష్టం చేసిన వాళ్లమవుతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
**అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు..**
వివిధ మార్గాల ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా రూ. 8.21 లక్షల కోట్ల అప్పులు చేసిందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ అప్పుల భారంపై రోజూ మాట్లాడితే రాష్ట్రం పరువు పోతుందనే ఉద్దేశంతోనే తాము సంయమనం పాటించామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు తమ అప్పులను తక్కువ చేసి చూపుతూ బుకాయింపులకు దిగుతున్నారని, ఇలా ఎన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారని ఆక్షేపించారు. పది శాతం వడ్డీకి కూడా గత ప్రభుత్వం అప్పులు తెచ్చిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వడ్డీల భారాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. తాము కట్టాల్సిన వడ్డీ భారాన్ని రూ. 34 వేల కోట్ల నుంచి రూ. 11 వేల కోట్లకు తగ్గించామన్నారు. ఇప్పటికే వడ్డీతో కలిపి రూ. 2.08 లక్షల కోట్లను తమ ప్రభుత్వం చెల్లించిందని గుర్తుచేశారు. రోడ్డుపై నిలబడి అడ్డగోలుగా మాట్లాడుతున్న కేటీఆర్, హరీశ్‌రావు కాకుండా.. రాష్ట్రంపై పెనుభారం మోపిన ఈ అప్పుల వ్యవహారంపై స్వయంగా కేసీఆర్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. వారు చేసిన అప్పులు తీర్చేది కాళేశ్వరం కార్పొరేషనా లేక ప్రభుత్వమా అని నిలదీశారు.
**సింగరేణి బొగ్గు మాయంపై దర్యాప్తు..**
సింగరేణి సంస్థను గత ప్రభుత్వం పదేళ్ల పాటు తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు సింగరేణి ప్రాంతాల్లో పర్యటిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి సంస్థకు కొత్త కోల్ బ్లాక్లు రాకుండా అడ్డుకున్నది కేటీఆర్, హరీశ్‌రావులు కాదా అని ప్రశ్నించారు. సంస్థ నుంచి కేజీ బొగ్గు కూడా బయటకు వెళ్లే అవకాశం లేదని, అయినప్పటికీ వారు చేసిన బొగ్గు మాయం ఆరోపణలను తాము సీరియస్‌గా తీసుకున్నామన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని సంస్థ విజిలెన్స్ డైరెక్టర్‌ను ఆదేశించినట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. సింగరేణికి నష్టం కలిగించాలని బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని, సంస్థ నష్టపోతే అంతిమంగా రాష్ట్ర ప్రజలే నష్టపోతారని ఆయన పేర్కొన్నారు. కొత్త కోల్ బ్లాక్‌లు తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వివరించారు.
**టెండర్ల విలువే రూ. 1142 కోట్లు.. అందులో రూ. 2 వేల కోట్ల అవినీతా?**
మాజీ మంత్రి హరీశ్ రావు తాను ఏ స్థాయిలో ఉన్నారో మరచి మాట్లాడుతున్నారని భట్టి దుయ్యబట్టారు. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన వస్తువులు అందించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం రూ. 1,142 కోట్లకు టెండర్లు పిలిస్తే, అందులో రూ. 2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీశ్ రావు ఆరోపించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. పదేళ్ల పాటు దోపిడీ చేసింది కేసీఆర్ కాదా అని ఆయన ప్రశ్నించారు. బాధ్యతాయుతంగా పనిచేస్తున్న మంత్రులపై అభాండాలు వేయడం సరికాదని హితవు పలికారు. ఎవరి స్థాయి ఏమిటో వారు పోషించే పాత్ర ద్వారానే తెలుస్తుందని, కీలక విషయాలపై కేసీఆర్ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.








