Mahaa Daily Exclusive

  ట్రంప్ మెమ్‌కాయిన్ దెబ్బ..! పది లక్షల మందికి భారీ నష్టాలు..!

Share

వాషింగ్టన్, మహా.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో విడుదలైన ‘ట్రంప్’ మెమ్‌కాయిన్ పెట్టుబడిదారులకు భారీ నష్టాలను మిగిల్చింది. ట్రంప్ ప్రజాదరణ, ఆయన రాజకీయ ప్రభావాన్ని నమ్మి ఈ డిజిటల్ టోకెన్‌లో పెట్టుబడులు పెట్టిన లక్షలాది మంది ఇన్వెస్టర్లు ఇప్పుడు తీవ్ర నష్టాల్లో కూరుకుపోగా, మరోవైపు ఈ ప్రాజెక్టు ద్వారా ట్రంప్, ఆయనకు అనుబంధంగా ఉన్న సంస్థలు వందల మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

 

దాదాపు పది లక్షల వాలెట్లు నష్టాల్లో

 

బ్లాక్‌చెయిన్ విశ్లేషణ సంస్థ నాన్సెన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, జూన్ చివరి నాటికి మొత్తం 9,88,905 క్రిప్టో వాలెట్లు నష్టాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ మెమ్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టిన వారిలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు నష్టపోయినట్లుగా విశ్లేషణ వెల్లడించింది. క్రిప్టో మార్కెట్‌లో అధిక లాభాల ఆశతో పెట్టుబడులు పెట్టిన చిన్న, మధ్య తరహా ఇన్వెస్టర్లే ఎక్కువగా నష్టపోయినట్లు పేర్కొంది.

 

గరిష్ట స్థాయి నుంచి 97 శాతం పతనం

 

2025 జనవరిలో మార్కెట్లోకి వచ్చిన ఈ మెమ్‌కాయిన్ ప్రారంభంలోనే భారీ ఉత్సాహాన్ని సృష్టించింది. ఒక్కో టోకెన్ ధర గరిష్టంగా 75.35 డాలర్ల వరకు చేరింది. అయితే అనంతరం వరుస అమ్మకాల ఒత్తిడి, మార్కెట్ అనిశ్చితి కారణంగా ధర క్రమంగా క్షీణించింది. ప్రస్తుతం ఈ టోకెన్ విలువ 1.76 డాలర్ల వద్దకు పడిపోవడంతో గరిష్ట స్థాయి నుంచి దాదాపు 97 శాతం విలువ ఆవిరైందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

3.81 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడిదారుల నష్టం

 

ఈ ధర పతనం కారణంగా పెట్టుబడిదారులందరూ కలిపి సుమారు 3.81 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసినట్లు నివేదిక వెల్లడించింది. భారీ లాభాల ఆశతో పెట్టుబడులు పెట్టిన అనేక మంది తమ పెట్టుబడిలో అధిక భాగాన్ని కోల్పోయారని విశ్లేషకులు తెలిపారు.

 

పెట్టుబడిదారుల ఆవేదన

 

ట్రంప్‌కు మద్దతుదారులుగా ఉన్న పలువురు కూడా ఈ మెమ్‌కాయిన్ కారణంగా తీవ్రంగా నష్టపోయినట్లు చెబుతున్నారు. పెట్టుబడిదారుడు నికోలస్ పింటో మాట్లాడుతూ తాను 5 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టగా, అందులో సగం వరకు నష్టపోయానని వెల్లడించారు. ఒక దేశాధ్యక్షుడిపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని ఇలాంటి టోకెన్లను ప్రోత్సహించడం చట్టబద్ధమైన మోసం లాంటిదేనని ఆయన వ్యాఖ్యానించారు.

 

ట్రంప్‌కు మాత్రం భారీ ఆదాయం

 

ఈ మెమ్‌కాయిన్ రూపకల్పనలో ప్రతి కొనుగోలు, విక్రయ లావాదేవీపై వసూలయ్యే ఫీజులో కొంత భాగం ట్రంప్‌కు, ఆయన అనుబంధ సంస్థలకు చేరే విధంగా వ్యవస్థ రూపొందించబడినట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో టోకెన్ ధర భారీగా పడిపోయినా, లావాదేవీల ద్వారా ట్రంప్‌కు ఆదాయం కొనసాగిందని వెల్లడైంది. ట్రంప్ వార్షిక ఆర్థిక వెల్లడిలో ఈ మెమ్‌కాయిన్ ద్వారానే సుమారు 636 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చినట్లు నమోదు చేసినట్లు సమాచారం. అలాగే 2025లో ఆయన వివిధ వ్యాపార కార్యకలాపాల ద్వారా మొత్తం 2.2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు వెల్లడైంది.