అజిత్ ఢోబాల్ సేవలకు చరిత్రలో ‘గోల్డెన్ పేజీ’ ఉంటుంది.
* లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం-2026 ప్రదానం.
* దేశ భద్రత, విదేశాంగ విధానంలో ఢోబాల్ పాత్రను కొనియాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
పుణె, మహా.
జాతీయ భద్రత, విదేశాంగ విధానాన్ని బలోపేతం చేయడంలో విశేష సేవలందించిన జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ ఢోబాల్‌కు ప్రతిష్ఠాత్మక ‘లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం-2026’ ప్రదానం చేశారు. శనివారం పుణెలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఢోబాల్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం మాట్లాడిన అమిత్ షా, దేశ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంలో అజిత్ ఢోబాల్ చేసిన సేవలను ప్రశంసలతో ముంచెత్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న తొలి కీలక నిర్ణయాల్లో అజిత్ ఢోబాల్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించడం ఒకటని అమిత్ షా గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వ హయాం గానీ, దేశ అంతర్గత, బాహ్య భద్రత చరిత్ర గానీ ఎప్పుడైనా లిఖించబడితే, అజిత్ ఢోబాల్ సేవలకు తప్పకుండా ఒక ‘గోల్డెన్ పేజీ’ కేటాయించాల్సి ఉంటుందని అన్నారు.
గతంలో బలహీనంగా ఉన్న భారత విదేశాంగ విధానం ప్రస్తుతం దృఢమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన విధానంగా మారడంలో ఢోబాల్ పాత్ర అత్యంత కీలకమైందని షా పేర్కొన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన ప్రతి ప్రధాన నిర్ణయంలో ప్రధాని మోదీకి ఆయన అందించిన సలహాలు ఎంతో విలువైనవని కొనియాడారు.
తాను గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసుల దర్యాప్తులో అజిత్ ఢోబాల్ వ్యూహాత్మక సలహాలు కీలకంగా నిలిచాయని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు ఢోబాల్‌తో జరిగిన చర్చల తర్వాత గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్ పేలుళ్ల కేసుతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన మరో 13 బాంబు పేలుళ్ల కేసులను ఛేదించగలిగారని వెల్లడించారు.
అదేవిధంగా, లోకమాన్య బాల గంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను అమిత్ షా స్మరించుకున్నారు. “స్వరాజ్యం నా జన్మహక్కు” అనే నినాదంతో కోట్లాది భారతీయుల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించిన మహనీయుడిగా తిలక్‌ను అభివర్ణించారు. తిలక్ కలలుగన్న సాంస్కృతిక జాతీయవాద మార్గంలోనే భారత్ పయనిస్తోందని, ఆ మార్గం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
పురస్కారం అందుకున్న అనంతరం మాట్లాడిన అజిత్ ఢోబాల్ దేశ యువతకు కీలక సందేశం ఇచ్చారు. ప్రతి భారతీయుడు, ముఖ్యంగా యువత లోకమాన్య తిలక్ జీవితాన్ని, దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను, ఆయన దార్శనికతను లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు.
స్వాతంత్ర్యం అంటే ఇష్టానుసారంగా వ్యవహరించే స్వేచ్ఛ కాదని, దేశం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛ అని ఢోబాల్ పేర్కొన్నారు. భయం, అణచివేత, దుర్భర పరిస్థితులు నెలకొన్న కాలంలో ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని నింపిన గొప్ప నాయకుడిగా లోకమాన్య తిలక్ నిలిచారని ఆయన కొనియాడారు.






