Mahaa Daily Exclusive

  స్వాతంత్ర్యం అంటే ఇష్టారీతిన వ్యవహరించడం కాదు…

Share

స్వాతంత్ర్యం అంటే ఇష్టారీతిన వ్యవహరించడం కాదు.
* హక్కులతో పాటు దేశం పట్ల బాధ్యత కూడా ఉండాలి.
* జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ డోభాల్.

పుణె, మహా.

నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జెన్-జీ యువత నిరసనల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ డోభాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం అంటే ఇష్టారీతిన వ్యవహరించే అపరిమిత స్వేచ్ఛ కాదని, హక్కులతో పాటు దేశం, సమాజం పట్ల బాధ్యత కూడా ప్రతి పౌరుడికి ఉండాలని స్పష్టం చేశారు.

పుణెలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు స్వీకరించిన అనంతరం అజిత్ డోభాల్ ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలు, వారు నెలకొల్పిన విలువలకు నేటి యువత ప్రతిరూపంగా నిలవాలని పిలుపునిచ్చారు.

“భారత్ గతంలో కూడా ఇలాగే ఉండేదని కొందరు యువత భావిస్తుండవచ్చు. లేదా స్వాతంత్ర్యం అంటే ఇష్టానుసారంగా వ్యవహరించే అపరిమిత స్వేచ్ఛ అని అపోహపడవచ్చు. కానీ స్వాతంత్ర్యానికి అది అర్థం కాదు” అని డోభాల్ అన్నారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, దేశం పట్ల బాధ్యత కూడా అంతే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ జీవితం, ఆలోచనలు యువతకు ఆదర్శంగా నిలవాలని డోభాల్ సూచించారు. దేశ నిర్మాణం, జాతీయ చైతన్యం, స్వాభిమానం గురించి తిలక్ చెప్పిన విషయాలను యువత లోతుగా అధ్యయనం చేయాలని, భారత భవిష్యత్తు కోసం ఆయన చూపిన దారిని అర్థం చేసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అజిత్ డోభాల్ సేవలను కొనియాడారు. భారత విదేశాంగ విధానం, జాతీయ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంలో డోభాల్ విశేష పాత్ర పోషించారని ప్రశంసించారు. జాతీయ భద్రతకు సంబంధించిన ప్రధాన నిర్ణయాల విషయంలో ప్రధాని తీసుకునే ప్రతి కీలక నిర్ణయం వెనుక డోభాల్ సలహాలు, మార్గదర్శకత్వం ఉంటాయని పేర్కొన్నారు.

దేశ భద్రత, వ్యూహాత్మక అంశాల్లో అజిత్ డోభాల్ అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అమిత్ షా అన్నారు. భారత జాతీయ భద్రతా రంగంలో ఆయన కృషికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, చరిత్రలో ఆయనకంటూ ఒక బంగారు అధ్యాయం లిఖితమవుతుందని వ్యాఖ్యానించారు.