Mahaa Daily Exclusive

  ‘స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలి’.. కుప్పం నుంచి టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం..!

Share

కుప్పం,మహా.

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీల వరకు అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూనే, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా కార్యకర్తలు వ్యవహరించాలని సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మూడో రోజు పర్యటనలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన విస్తృతంగా మాట్లాడారు.

 

క్షేత్రస్థాయిలో రాజకీయ పరిపాలన అవసరం

 

సుపరిపాలన అంటే కేవలం ప్రభుత్వం పనిచేయడమే కాదని, గ్రామస్థాయి వరకు రాజకీయ పరిపాలన సమర్థంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో పార్టీ కార్యకర్తల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకత్వం సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ పథకాల ఫలితాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందుతాయని వివరించారు.

 

అధికారులు, పోలీసులతో సమన్వయం

 

ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగంతో సమన్వయం పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. గ్రామాలు, వార్డుల్లో ఎదురవుతున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వేగంగా పరిష్కరించేలా చొరవ చూపాలని కోరారు. పేద ప్రజల పక్షాన నిలిచే తెలుగుదేశం కార్యకర్తలకు ప్రభుత్వ యంత్రాంగం తగిన గౌరవం ఇవ్వాలని కూడా ఆయన పేర్కొన్నారు.

 

గత ప్రభుత్వంపై విమర్శలు

 

రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు సాగిన పాలన ప్రజలకు పీడకలగా మారిందని చంద్రబాబు విమర్శించారు. ఆ కాలంలో కుప్పం నియోజకవర్గంలో కూడా ప్రశాంతతను భంగపరిచే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే రాజకీయాలకు రాష్ట్రంలో ఇక చోటు ఉండదని స్పష్టం చేశారు.

 

కుప్పంలో రౌడీయిజానికి అవకాశం లేదు

 

కుప్పంలో ఎలాంటి రౌడీయిజం, బెదిరింపులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం సహించబోదని చంద్రబాబు హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు కూడా సంయమనంతో వ్యవహరిస్తూ ప్రజల్లో మంచి పేరు నిలబెట్టుకోవాలని సూచించారు.

 

స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి

 

త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థలన్నింటిలోనూ కూటమి విజయాన్ని నమోదు చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బూత్ స్థాయి నుంచి ఓటర్లతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

 

పనితీరే పదవులకు ప్రమాణం

 

పార్టీలో ఇకపై పదవులు కేవలం పనితీరు ఆధారంగానే ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. సిఫారసులు, వ్యక్తిగత అనుబంధాలకు ప్రాధాన్యం ఉండదని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే అవకాశాలు లభిస్తాయని తెలిపారు. బూత్ స్థాయి నుంచి ఏ పదవికైనా కార్యకర్తల ఆమోదం, ప్రజల్లో విశ్వసనీయత కీలక ప్రమాణాలుగా ఉంటాయని పేర్కొన్నారు.

 

2029 లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యాచరణ

 

రాబోయే స్థానిక ఎన్నికల విజయాన్ని 2029 అసెంబ్లీ ఎన్నికలకు పునాదిగా మార్చాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గతం కంటే మరింత మెరుగైన మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందించాలని కోరారు.

 

కార్యకర్తల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం

 

పార్టీ కార్యకర్తల ఆర్థిక సాధికారతకు కూడా ప్రభుత్వం, పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు తెలిపారు. “ఇంటికో పారిశ్రామికవేత్త” లక్ష్యంతో యువత, కార్యకర్తలు స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. ఆర్థికంగా బలమైన కార్యకర్తలే సమాజంలో మరింత సమర్థవంతంగా సేవ చేయగలరని అన్నారు.

 

ఓటర్ల జాబితా, సమన్వయ కమిటీపై ఆదేశాలు

 

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని పార్టీ నాయకులకు చంద్రబాబు సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే అందరి అభిప్రాయాలతో త్వరలోనే కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు.

 

సమన్వయంతో విజయమే లక్ష్యం

 

కుప్పం పర్యటనలో భాగంగా రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమైన అనంతరం పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ స్థానిక ఎన్నికల నుంచి 2029 ఎన్నికల వరకు విజయపథంలో ముందుకు సాగాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.