లక్నో, మహా.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సమాజ్‌వాదీ పార్టీతో ఎన్నికల పొత్తుకు సిద్ధమని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా లౌకిక శక్తులు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చిన ఆయన, చర్చలు ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఒవైసీ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పడాలంటే ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మజ్లిస్ పార్టీ ఎలాంటి అహంకారానికి తావివ్వకుండా ఇతర పార్టీలతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపించిన తర్వాత చర్చలు ప్రారంభించి ప్రయోజనం ఉండదని, ఇప్పుడే పొత్తులపై స్పష్టత రావాలని సూచించారు.
‘నేను పోటీ చేస్తే మీ ఓట్లు చీలిపోతాయని అంటున్నారు. అలాంటప్పుడు మీతో కలిసి పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మాకు కావాల్సింది అధికార పదవులు కాదు.. హక్కులు, గౌరవం, సమానత్వం’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో కలిసి కూర్చొని ప్రజల హక్కులు, సామాజిక న్యాయం గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తమ పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని, రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఒవైసీ వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ముస్లిం, వెనుకబడిన వర్గాల ఓట్ల సమీకరణ నేపథ్యంలో ఆయన చేసిన ప్రతిపాదనపై సమాజ్‌వాదీ పార్టీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు సమాజ్‌వాదీ పార్టీ అధికారికంగా స్పందించలేదు.
మరోవైపు, ఒవైసీ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఇవి ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. ఒవైసీ, అఖిలేష్ యాదవ్ ఇద్దరూ ఒకే నాణేనికి రెండు వైపులాంటి వారని, ఎన్నికల లబ్ధి కోసం మతపరమైన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. దీంతో ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందే రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.






