- పంటల కొనుగోలు, ఎరువుల పంపిణీలో కీలక బాధ్యతలు.
- తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
హైదరాబాద్, మహా:
రాష్ట్రంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను వ్యవసాయాభివృద్ధిలో కీలక భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కనీస మద్దతు ధర కింద పంటల కొనుగోలు కేంద్రాల నిర్వహణ నుంచి ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల పంపిణీ వరకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ జూలై 8న జీవో ఆర్టీ నంబరు 390ను జారీ చేసింది. రైతు సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో వారి పాత్రను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇప్పటివరకు పంటల కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. తాజా ఉత్తర్వులతో అర్హత కలిగిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కూడా సమాన అవకాశాలు కల్పించనున్నారు. వరి, మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, పొద్దుతిరుగుడు, శనగలు తదితర పంటల కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మౌలిక సదుపాయాలు, ఆర్థిక సామర్థ్యం, సమర్థవంతమైన నిర్వహణ ఉన్న రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అప్పగించాలని జిల్లా స్థాయి కమిటీలకు ప్రభుత్వం ఆదేశించింది.
వ్యవసాయ ఉత్పాదకాల సరఫరాలో కూడా రైతు ఉత్పత్తిదారుల సంఘాల పాత్రను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు నాణ్యమైన ఎరువులు, ధ్రువీకరించిన విత్తనాలు, పురుగుమందులు సకాలంలో అందించేందుకు అవసరమైన లైసెన్సులను జిల్లా వ్యవసాయ అధికారులు త్వరితగతిన మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దరఖాస్తుల పరిశీలనలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది.
రైతు సంఘాల బలోపేతానికి అనుగుణంగా యూరియా, ముఖ్యంగా ఇఫ్కో ద్వారా సరఫరా అయ్యే ఎరువులు, పచ్చిరొట్ట ఎరువుల కేటాయింపులో రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సభ్య రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలు నేరుగా వారి సంఘాల ద్వారానే అందే అవకాశం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎరువుల సరఫరాలో మధ్యవర్తుల జోక్యం తగ్గి, రైతులకు మరింత పారదర్శకంగా సేవలు అందే పరిస్థితులు ఏర్పడనున్నాయి.
ఈ కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్లు ప్రత్యక్ష పర్యవేక్షణ వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. పంటల కొనుగోలు కేంద్రాల నిర్వహణ, లైసెన్సుల మంజూరు, ఎరువుల పంపిణీ తదితర అంశాలపై పౌరసరఫరాల సంస్థ, మార్క్ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులతో తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహించి పురోగతిని పరిశీలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అమలులో ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో రైతుల ఆధ్వర్యంలో పనిచేసే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం కావడంతో పాటు గ్రామీణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంటల కొనుగోలులో దళారీ వ్యవస్థ ప్రభావం తగ్గి, రైతులు తమ పంటకు గిట్టుబాటు ధరను నేరుగా పొందే అవకాశం పెరుగుతుందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల సరఫరాలో రైతు సంఘాల పాత్ర పెరగడం ద్వారా వ్యవసాయ సేవలు గ్రామస్థాయిలో మరింత సమర్థవంతంగా అందుబాటులోకి రానున్నాయి. రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, రైతు సంఘాలను స్వయం సమృద్ధి సంస్థలుగా తీర్చిదిద్దడం అనే ప్రభుత్వ లక్ష్యాలకు ఈ నిర్ణయం కీలకంగా మారనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.








