హైదరాబాద్, మహా : భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఎల్‌బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోని బాలాదేవి, అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి.టి. ఉష మాట్లాడుతూ, ఈ భవన్ ప్రారంభోత్సవం భారత క్రీడా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ భవనం కేవలం ఒక కార్యాలయం మాత్రమే కాదు, భావితర క్రీడాకారుల కలలను సాకారం చేసే కేంద్రంగా, ఒలింపిక్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలవనుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయమని, రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని కొనియాడారు.







