Mahaa Daily Exclusive

  వాట్సాప్ ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌కు కేంద్రం బ్రేక్..! గడువు ముగిసినా అనుమతి లేదు…!

Share

ఢిల్లీ, మహా.

భారత్‌లో వాట్సాప్ ప్రవేశపెట్టాలని భావిస్తున్న ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం తన కఠిన వైఖరిని కొనసాగించింది. ఈ ఫీచర్‌కు సంబంధించి కేంద్ర సమాచార సాంకేతిక శాఖ జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇవ్వడానికి నిర్ణయించిన గడువు గురువారంతో ముగిసిందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ తెలిపారు. గడువు పొడిగించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

అనుమతి వచ్చేవరకు ఫీచర్ విడుదల లేదు

కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలో భారత్‌లో ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌ను అమలు చేయబోమని వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సంతృప్తి కలిగే వరకు ఈ ఫీచర్‌ను దేశంలో అందుబాటులోకి తీసుకురామని తెలిపింది. కేంద్రం జారీ చేసిన నోటీసులకు సంబంధించి తమ వివరణను గురువారం సమర్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది.

 

యూజర్‌నేమ్ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఫోన్ నంబర్‌ను వెల్లడించకుండా పరస్పరం సందేశాలు పంపుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ విధానం వల్ల నేరస్థులు తమ అసలు గుర్తింపును దాచుకునే అవకాశాలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఆన్‌లైన్ మోసాల దర్యాప్తు మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉందని ఐటీ శాఖ పేర్కొంది.

 

వాట్సాప్‌తో పాటు ఇప్పటికే యూజర్‌నేమ్ ఆధారిత వ్యవస్థను అమలు చేస్తున్న టెలిగ్రామ్, సిగ్నల్ సందేశాల యాప్‌లకు కూడా కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ సంస్థల నుంచి పూర్తి వివరణ కోరినట్లు అధికారులు తెలిపారు. టెలిగ్రామ్, సిగ్నల్ సంస్థలకు సమాధానం ఇవ్వడానికి మరికొంత గడువు ఇచ్చినట్లు ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ వెల్లడించారు.

 

సైబర్ మోసాలను అరికట్టేందుకు బహుళ స్థాయి భద్రతా వ్యవస్థలను అమలు చేస్తున్నట్లు వాట్సాప్ ప్రతినిధులు తెలిపారు. ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, అధికారిక ఖాతాల పేర్లను ఇతరులు దుర్వినియోగం చేయకుండా ముందుగానే రిజర్వ్ చేసే విధానాన్ని అమలు చేస్తామని వివరించారు. వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.

 

భారత్‌లో వాట్సాప్‌ను కోట్లాది మంది వినియోగిస్తున్న నేపథ్యంలో వినియోగదారుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో సుమారు 50 కోట్లకు పైగా వాట్సాప్ వినియోగదారులు ఉన్నందున, కొత్త ఫీచర్ల వల్ల సైబర్ నేరాలకు అవకాశం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనల విధానం, టెలిగ్రామ్‌లో పైరసీకి సంబంధించిన అంశాలపైనా కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Latest