Mahaa Daily Exclusive

  ఖమ్మంలో రూ.300 కోట్ల ఆయిల్ పామ్ ప్రాజెక్టుకు వేగం..

Share

  • గోద్రేజ్ ఆగ్రోవెట్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ.

హైదరాబాద్, మహా:

 

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు, విలువ ఆధారిత వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోంది. ఈ దిశగా రాష్ట్రంలో తొలి ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ఏర్పాటు, ఆయిల్ పామ్ సాగు విస్తరణ, పరిశోధన కేంద్రాల అభివృద్ధి తదితర అంశాలపై గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ రంగంలో చేపట్టనున్న ప్రణాళికలపై సంస్థ ప్రతినిధులు సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు.

 

ఎంసీఆర్ మానవ వనరుల అభివృద్ధి సంస్థలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో గోద్రేజ్ గ్రూపు సంస్థల కార్పొరేట్ వ్యవహారాల అధ్యక్షుడు రాకేష్ స్వామి, గోద్రేజ్ ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ విభాగం ప్రధాన కార్యనిర్వాహణ అధికారి సౌగత నియోగి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, భవిష్యత్ పెట్టుబడుల అవకాశాలపై ముఖ్యమంత్రితో వారు సుదీర్ఘంగా చర్చించారు.

 

ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో రూ.300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న సమీకృత ఆయిల్ పామ్ ప్రాజెక్టు పురోగతిని కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 700 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు ఆధునిక నర్సరీ, పరిశోధన–అభివృద్ధి కేంద్రం, అత్యాధునిక సీడ్ గార్డెన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

 

ఈ ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే కేటాయించినట్లు ప్రతినిధులు గుర్తు చేశారు. సీడ్ గార్డెన్‌ను మరింత విస్తరించేందుకు అదనంగా 35 నుంచి 40 ఎకరాల భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. అలాగే ప్రాసెసింగ్ యూనిట్‌కు రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా అనుసంధాన రహదారిని విస్తరించాలని విజ్ఞప్తి చేశారు.

 

కంపెనీ ప్రతినిధుల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు రైతులకు ప్రయోజనం చేకూరేలా అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ప్రాసెసింగ్ యూనిట్‌కు అనుసంధానంగా రహదారి విస్తరణ పనులను తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

 

రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు దిగుమతి చేసుకునే వంటనూనెలపై ఆధారాన్ని తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ఖమ్మంలో ఏర్పాటవుతున్న ఈ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ పూర్తయితే తెలంగాణలో ఆయిల్ పామ్ రంగానికి కొత్త ఊపునిచ్చే కీలక పారిశ్రామిక కేంద్రంగా అవతరించే అవకాశముందని భావిస్తున్నారు.

Latest