హైదరాబాద్, మహా.
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు అమలులో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రతిష్ఠాత్మక మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు తొలి దశ పనులకు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణ వ్యయం మినహా ఈ నిధులను మంజూరు చేయగా, ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
21 కిలోమీటర్ల ప్రాధాన్య కారిడార్ అభివృద్ధి
ప్రాజెక్టు తొలి దశలో జోన్–1ఏ, జోన్–1బీ పరిధిలోని ప్రాధాన్య కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు. హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.20 కిలోమీటర్లు, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.80 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. మొత్తం 21 కిలోమీటర్ల విస్తీర్ణంలో నది తీరం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణ చర్యలు అమలు చేయనున్నారు.
రుణాల ద్వారా నిధుల సమీకరణ
ప్రాజెక్టు కోసం అవసరమైన రూ.7,345.12 కోట్లలో ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రూ.4,500 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మిగిలిన రూ.2,845.12 కోట్లను హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ లేదా తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ ద్వారా రుణంగా సమీకరించేందుకు అనుమతించింది.
ఈపీసీ విధానంలో పనులు
మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పనులను ఈపీసీ విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానంలో ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం, అమలు బాధ్యతలను ఒకే సంస్థ నిర్వహించనుంది. దీంతో పనులు నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
పర్యవేక్షణకు ప్రత్యేక కన్సల్టెన్సీ
ప్రాజెక్టు అమలు, నాణ్యత, పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థను నియమించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సంస్థ ప్రణాళిక నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు అన్ని దశలను పర్యవేక్షించి సాంకేతిక సూచనలు అందించనుంది.
తదుపరి చర్యలకు ఆదేశాలు
ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పరిపాలనా, సాంకేతిక ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి పనులను ప్రారంభించాలని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మూసీ నది పునరుజ్జీవనం ద్వారా నగర పర్యావరణ పరిరక్షణ, వరదల నియంత్రణ, నది తీరాల అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.








