Mahaa Daily Exclusive

  గోడెక్కిన ప్రేమ క‌థ..! గ్రామంలో కలకలం రేకెత్తించిన వాల్ పోస్టర్లు..

Share

  • గోడెక్కిన ప్రేమ క‌థ
  • ప్రేమ విషయం తెలిసినా
  • 16 తులాల బంగారం కోసం తన ప్రేయసిని పెళ్ళాతున్నాడని ఆరోపణ
  • గ్రామంలో కలకలం రేకెత్తించిన వాల్ పోస్టర్లు

 

సిరిసిల్ల, మహా : ప్రేమ కోసం యువతీయువకులు చేస్తున్న సాహసాలు రోజురోజుకూ కొత్త రూపం దాలుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు తన ప్రేమ కాపాడుకోవాలనే ప్రయత్నంలో అర్ధరాత్రి గ్రామానికి చేరుకుని గోడలపై ప్రేమ సందేశాలతో పోస్ట‌ర్లు అతికించడం సంచలనంగా మారింది. ఈ ఘటన తంగళ్లపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు ఏడు సంవత్సరాలుగా సిరిసిల్ల జిల్లాకు చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమె కుటుంబ సభ్యులు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారని తెలుసుకున్న యువకుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీంతో అర్ధరాత్రి కారులో తంగళ్లపల్లికి చేరుకున్న యువకుడు, ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రేమ సందేశాలతో కూడిన స్టిక్కర్లను గ్రామంలోని పలుచోట్ల గోడలపై అతికించాడు. ఉదయం వాటిని చూసిన గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. విషయం క్షణాల్లోనే గ్రామమంతా వ్యాపించి చర్చనీయాంశమైంది.

 

ఆ పోస్ట‌ర్ల‌లో త‌న పేరు వంగ విజ‌య్ గౌడ్ తండ్రి పేరు గోపాల్ గౌడ్ అని తెలిపిన ఆ యువ‌కుడు త‌ను ప్రేమించిన అమ్మాయికి త‌ల్లిదండ్రులు బ‌ల‌వంతంగా పెండ్లి చేస్తున్నారని వెల్ల‌డించారు. త‌మ ప్రేమ విష‌యం పెండ్లి అవుతున్న అబ్బాయికి చెప్పినా 16 తులాల బంగారం కోసం ఈ పెండ్లి చేసుకుంటున్నాడ‌ని ఆ పోస్ట‌ర్ల‌లో రాశాడు. యువకుడు స్టిక్కర్లు అతికిస్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డవగా, అనంతరం స్థానికులు వాటిని తొలగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యువతి తలిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest