Mahaa Daily Exclusive

  ఇంజినీర్లను బెదిరించి చరిత్రను మార్చలేరు : దేవీప్రసాద్

Share

హైదరాబాద్, మహా : తెలంగాణ ఇంజినీర్లను బెదిరించి చరిత్రను మార్చలేరని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ఇంజినీర్లను అవమానించడం అంటే ఉద్యమ స్ఫూర్తినే అవమానించినట్లేనని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ నాయకుడు గుండవరం దేవీప్రసాద్ అన్నారు.
తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు జరిగిన నీటి వివక్షను శాస్త్రీయ ఆధారాలతో దేశం ముందు ఉంచిన ఘనత తెలంగాణ ఇంజినీర్లదేనని పేర్కొన్నారు. అలాంటి ఇంజినీర్లను అభినందించాల్సిన రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం శ్రమించిన ఇంజినీర్లను నేడు నిందితుల్లా చిత్రీకరించడం దురదృష్టకరమని అన్నారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత తెలంగాణ అవసరాలకు సరిపోదని, మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని సెంట్రల్ వాటర్ కమిషన్‌తో పాటు రిటైర్డ్ ఇంజినీర్లు చేసిన సాంకేతిక సూచనల ఆధారంగానే అప్పటి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.
ప్రస్తుతం అదే ఇంజినీర్లను బెదిరిస్తూ రాజకీయ కక్షసాధింపునకు అనుగుణంగా నివేదికలు ఇవ్వాలని పరోక్షంగా హెచ్చరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని దేవీప్రసాద్ ఆరోపించారు. గతంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన సందర్భాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఇంజినీర్లతో చర్చించి వారి సూచనలను గౌరవించిందని, ప్రస్తుతం మాత్రం ప్రశ్నించిన వారిని కేసులతో భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, సమ్మక్కసాగర్ వంటి ప్రాజెక్టులు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలని, వాటి కోసం పనిచేసిన ఇంజినీర్లను అవమానించడం ప్రతి తెలంగాణవాదిని అవమానించినట్లేనని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని విశ్వసించే ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు.