పేపర్ లీకులు, అవినీతిపై కేంద్రం మౌనం వీడాలి
• భారత విద్యా వ్యవస్థపై రాహుల్ గాంధీ విమర్శలు..
ఢిల్లీ, మహా.
భారత విద్యా వ్యవస్థపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ విద్యా వ్యవస్థ నిజాయతీ లేని దోపిడీ యంత్రాంగంగా మారిందని ఆరోపించిన ఆయన, వరుస ప్రశ్నపత్రాల లీకులు, అవినీతిపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ స్పందించడం లేదని విమర్శించారు.
సోమవారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో చేసిన పోస్టులో రాహుల్ గాంధీ విద్యా వ్యవస్థపై తన అభిప్రాయాలను వెల్లడించారు. అవినీతి, అన్యాయం, పక్షపాతం, నిజాయితీ లేని వ్యవస్థ అనే పదాలు తనవి కావని, దేశవ్యాప్తంగా విద్యార్థులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలేనని పేర్కొన్నారు.
విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధం చేయాల్సిన విద్యా వ్యవస్థ వారిని, వారి కుటుంబాలను అప్పులు, మానసిక ఒత్తిడి, నిరాశ వైపు నెడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో కొనసాగుతున్న అవినీతే ప్రశ్నపత్రాల లీక్ మాఫియాకు ప్రధాన కారణమని, పోటీ పరీక్షల కోసం ఏళ్ల తరబడి శ్రమించిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ఈ మాఫియా ఒక్కసారిగా నాశనం చేస్తోందని విమర్శించారు.
ప్రశ్నపత్రాల లీకుల వంటి కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌనం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికే కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్నారు. ఈ సమస్యలను ప్రశ్నించాల్సిన మీడియా కూడా దీర్ఘకాలంగా మౌనంగా ఉందని ఆయన విమర్శించారు.
దేశ విద్యా రంగంలో సమూల మార్పులు అవసరమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 17న డెహ్రాడూన్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి హాజరై విద్యార్థుల గొంతుకను మరింత బలంగా వినిపిద్దామని కోరారు. కార్యక్రమానికి సంబంధించిన నమోదు వివరాలను కూడా తన ‘ఎక్స్’ పోస్టు ద్వారా ఆయన పంచుకున్నారు.







