కన్నీటి విత్తనం నుండి ఆత్మగౌరవ వృక్షంగా.
* తెలంగాణ ఆయిల్ పామ్ రైతుల ఉద్యమ ప్రస్థానం.
(గడల నరసింహారావు సీనియర్ జర్నలిస్ట్)
తెలంగాణ నేలపై ఆయిల్ పామ్ సాగు ఒక అద్భుతమైన ప్రయాణం. దశాబ్దాల క్రితం మొదలైన ఈ సాగు, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నేడు ఒక మహోద్యమంగా మారింది. కేవలం పంట పండించడమే కాకుండా, తమ హక్కుల కోసం, వ్యవస్థలోని అవినీతిపై ఉక్కుపాదం మోపడం కోసం రైతులు ఏకమై ఒక మహాశక్తిగా ఎదిగిన తీరు యావత్ దేశానికే ఆదర్శం. ఒకప్పుడు ఫ్యాక్టరీల వద్ద క్యూ లైన్లలో పడిగాపులు కాసిన రైతులు, నేడు ఢిల్లీ పీఠాన్ని కదిలించే స్థాయికి ఎదగడం వెనుక ఎంతో పోరాటం, మరెంతో వ్యధ దాగి ఉన్నాయి.
**సాగుకు బీజం.. ఫ్యాక్టరీల కోసం నిరాహార దీక్షలు**
తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు చరిత్ర 1993వ సంవత్సరంలో అశ్వారావుపేటలో ప్రారంభమైంది. 2002 నాటికి సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ, స్థానికంగా ఫ్యాక్టరీ లేకపోవడంతో రైతులు పశ్చిమ గోదావరి జిల్లాలోని పెద్దవేగికి తమ పంటను తరలించాల్సిన దుస్థితి ఉండేది. ఈ కష్టాలను గమనించిన అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం, శాసనసభ్యులు జలగం వెంకటరావు కృషితో 2006లో ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ రంగంలో (ఆయిల్ ఫెడ్) మొట్టమొదటి ఫ్యాక్టరీని గంటకు 5 టన్నుల సామర్థ్యంతో ప్రారంభించింది. దీంతో రైతులు మరింత ఉత్సాహంగా తోటలు పెంచడం మొదలుపెట్టారు.
సమయం గడిచేకొద్దీ పండుతున్న పంటకు, ఫ్యాక్టరీ సామర్థ్యానికి పొంతన లేకుండా పోయింది. 2015 నాటికి ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని 30 టన్నులకు పెంచినప్పటికీ, దిగుబడులను ప్రాసెస్ చేయలేక ట్రాక్టర్లు రోజుల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి దాపురించింది. ఆ గడ్డు కాలంలో ఆయిల్ పామ్ రైతులు అఖిలపక్ష నాయకులతో కలసి, రెండవ ఫ్యాక్టరీ నిర్మించాలని డిమాండ్ చేస్తూ 24 సెప్టెంబర్ 2015న అశ్వారావుపేట ఫ్యాక్టరీ గేటు ముందు 8 రోజుల పాటు నిరాహార దీక్షకు దిగారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న అప్పటి కేబినెట్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , దమ్మపేట మండలం అప్పారావుపేటలో గంటకు 30 టన్నుల సామర్థ్యంతో రెండవ ఫ్యాక్టరీని మంజూరు చేయించారు. 2018లో పూర్తయిన ఈ ఫ్యాక్టరీ అత్యుత్తమ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ సాధించడంతో పాటు, అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో ఈ ప్రాంతంలో సాగు విపరీతంగా ఊపందుకుంది.
**అవమానాల పునాదుల మీద…**
2020లో ఆయిల్ పామ్ ధరలు అనూహ్యంగా పెరగడంతో రైతులు పెద్ద ఎత్తున సాగుకు ముందుకొచ్చారు. కానీ, అప్పుడే వ్యవస్థలోని డొల్లత బయటపడింది. మొక్కల కొరత ఏర్పడటం, ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీలో అవినీతి, ట్రాక్టర్ల సీరియల్లో అక్రమాలు, నకిలీ ఎఫ్-కోడ్ తో ఆంధ్ర ప్రాంత పండ్లను కొనుగోలు చేయడం, ఇక్కడి రైతులకు దక్కాల్సిన మొక్కలను అక్రమంగా పక్క రాష్ట్రానికి తరలించడం వంటి దుర్మార్గాలు చోటుచేసుకున్నాయి.
2019కి పూర్వం ఆయిల్ ఫెడ్ చైర్మన్లుగా కేవలం ఐఏఎస్ అధికారులు మాత్రమే ఉండేవారు. కానీ అప్పటి ప్రభుత్వం రాజకీయ నాయకులకు అవకాశం కల్పించింది. తమ సమస్యలు చెప్పుకుందామని వెళ్లిన రైతు ప్రతినిధులతో అప్పటి ఆయిల్ ఫెడ్ ఎండి, చైర్మన్ చులకనగా, హేళనగా మాట్లాడారు. కోఆపరేటివ్ ఫెడరేషన్, రైతు భాగస్వామ్య సంస్థ అనే కనీస విచక్షణ మరిచి ప్రైవేటు ఫ్యాక్టరీ ప్రతినిధుల్లా వారు ప్రవర్తించిన తీరు రైతులను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఆ అవమానమే ఆయిల్ పామ్ రైతులను ఏకం చేసింది. దీని ఫలితంగా అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి రోజున “తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ” (రిజిస్టర్ నెంబర్: 168/22)లాంఛనంగా ఆవిర్భవించింది.
**అవినీతిపై ఎక్కుపెట్టిన అస్త్రం**
సంఘం ఏర్పడిన నాటినుండి అధికారుల అక్రమాలపై అలుపెరగని పోరాటం సాగిస్తోంది. నకిలీ ఇన్వాయిస్లతో పండ్లు కొనకుండానే కొన్నట్లు చూపించడం, ఒకే లారీని వేర్వేరు రైతుల పేరు మీద నమోదు చేసి ప్రైవేటు ఫ్యాక్టరీలతో కుమ్మక్కై ఓ ఈ ఆర్ తగ్గించడం, ఫేక్ కోడ్లతో సొమ్ము దారి మళ్లించడం వంటి వాటిపై సంఘం న్యాయపోరాటం చేసింది. అధికారులకు అనుకూలమైన వారి ట్రాక్టర్లను ముందుగా పంపే విధానాన్ని అడ్డుకుని, సీరియల్ ప్రకారమే పంపేలా సాధించింది. ఆయిల్ ఫెడ్ అధికారుల కనుసన్నల్లో క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు దొంగతనంగా అమ్ముతుండగా పట్టుకుని పోలీసు కేసు నమోదు చేయించింది. అలాగే అశ్వారావుపేట, జనగాం నర్సరీల నుండి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న మొక్కల లారీలను సైతం పట్టుకుని క్రిమినల్ కేసులు పెట్టించింది.
**జన్యుపరమైన లోపాలు – కుప్పకూలిన రైతుల ఆశలు**
రైతు సంఘం చేసిన పోరాటాల్లో అత్యంత కీలకమైనది జన్యుపరమైన లోపం (కర్లింగ్) ఉన్న మొక్కలను గుర్తించడం. నారాయణపురానికి చెందిన పుచాయకాయల సోమిరెడ్డి తోటలో 60 శాతం మొక్కలు కాయకపోవడాన్ని బట్టి, ఆయిల్ పామ్‌లో కూడా కాయని మొక్కలు ఉంటాయన్న చేదు వాస్తవాన్ని సంఘం వెలుగులోకి తెచ్చింది. 2016 నుండి 2022 వరకు అశ్వారావుపేట నర్సరీ ఇచ్చిన మొక్కల్లో మహబూబాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఏకంగా 30 నుండి 98 శాతం వరకు మొక్కలు కాపుకు రాలేదని పైలట్ ప్రాజెక్టుల ద్వారా ఆధారాలతో సహా నిరూపించింది.
ఈ మహమ్మారికి ప్రధానంగా మూడు రకాల అవకతవకలే కారణమని సంఘం గుర్తించింది. మొదటిది, ఐఐఓపీఆర్ మార్గదర్శకాల ప్రకారం నాశనం చేయాల్సిన ఆఫ్-టైప్ (కర్లింగ్, ఎరెక్ట్ గ్రోత్) మొక్కలను, అధికారుల నిర్లక్ష్యంతో హానికర గ్రోత్ హార్మోన్లు చల్లి రైతులకు అంటగట్టడం. రెండవది, డిమాండ్ ఉన్న సమయంలో నర్సరీ సిబ్బంది మంచి మొక్కలను పక్క రాష్ట్రాలకు అమ్ముకుని, లెక్కలు సరిచేయడానికి తోటల్లో రాలి మొలిచిన నాసిరకం మొక్కలను నర్సరీలో కలపడం. మూడవది, అత్యంత దారుణమైన కుంభకోణం. అధికారులు ఇంపోర్టెడ్ విత్తనాలను పక్క రాష్ట్రాల ప్రైవేటు కంపెనీలకు అమ్ముకుని, బదులుగా అశ్వారావుపేటలో కేవలం 800 రూపాయలకు గెలలు కొని, ఆంధ్రాలో మొలకెత్తించి తిరిగి ఇక్కడి రైతులకు అంటగట్టారు. ఇందులో విదేశాల నుండి సీడ్ ఇంపోర్ట్ చేసే బ్రోకర్ల పాత్ర కూడా దాగి ఉంది.
**ప్రభుత్వాల నిర్లక్ష్యం…పాలకుల వద్దకు చేరిన పోరు**
ఈ సమస్యపై ఆయిల్ ఫెడ్ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శికి, హార్టికల్చర్ కమిషనర్‌కి, వ్యవసాయ మంత్రికి విజ్ఞప్తి చేసినా రెండేళ్లపాటు బుట్టదాఖలు చేశారు. రైతుల యాజమాన్య లోపం వల్లే కాయలు రావట్లేదని అధికారులు బుకాయించారు. ఆయిల్ ఫెడ్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి శాస్త్రవేత్తలతో 18 తోటలు తిరిగి జన్యుపరమైన లోపమేనని అంగీకరించినా, చట్టంలో నష్టపరిహారం ఇచ్చే వెసులుబాటు లేదని చేతులెత్తేశారు. రేగెళ్ళపాడు నర్సరీలో ఉన్న 3 లక్షల తంబా రకం మొక్కలు లోపభూయిష్టమైనవని మొత్తుకున్నా, చైర్మన్ వినకుండా వాటిని రైతులకు ఇచ్చి తీరుతామని మొండికేయడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
స్థానికంగా న్యాయం జరగకపోవడంతో జూలకంటి రంగారెడ్డి సాయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి సమస్యను వివరించారు. అక్కడితో ఆగకుండా, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ద్వారా ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి రాష్ట్ర రైతాంగం గోడును వెళ్లబోసుకున్నారు. 100 మంది రైతుల తోటలను ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలతో పరిశీలింపజేసి నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.
అదే సమయంలో 40,000 ఎకరాల్లో సాగు చేస్తున్న 6000 మంది గిరిజన రైతుల పక్షాన, సంఘం సభ్యులు కారం శ్రీరాములు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విచారణలో రాష్ట్ర అధికారులు సర్టిఫైడ్ మొక్కలే ఇచ్చామని కమిషన్‌ను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినా, రైతు సంఘం డాక్యుమెంటరీ ఆధారాలతో వారి బండారం బయటపెట్టింది. మూడేళ్ల లోపు తోటలను అధికారుల ఖర్చుతో తొలగించి కొత్త మొక్కలు నాటాలని, నాలుగేళ్లు పైబడిన తోటలకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని బలంగా వాదించింది. రైతులతో ఏకీభవించిన ఎస్టీ కమిషన్, ఒక నెల రోజుల్లో శాస్త్రవేత్తలతో విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.
**వాస్తవాలను ధృవీకరించిన జాతీయ శాస్త్రవేత్తలు**
కేంద్ర మంత్రి ఆదేశాలతో ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తల బృందం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు రోజులపాటు 27 తోటలను పరిశీలించి 200 శాంపిల్స్ సేకరించింది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇన్ని జన్యుపరమైన లోపాలు ఉన్న మొక్కలను చూసి వారు విస్తుపోయారు. నర్సరీ దశలోనే నాశనం చేయాల్సిన మొక్కలను రైతులకు ఇవ్వడం ఆయిల్ ఫెడ్ తీవ్ర నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని స్పష్టం చేశారు. ఈ పోరాటానికి సీపీఎం, బీజేపీ, భారతీయ కిసాన్ సంఘ్ వంటి సంస్థలు మద్దతు పలికాయి. 30 ఏళ్ల దీర్ఘకాలిక పంట అయిన ఆయిల్ పామ్‌ను నూతన తెలంగాణ విత్తన చట్టంలో చేర్చాలని కోదండ రెడ్డి కమిటీకి విజ్ఞప్తి చేసినా, ప్రైవేటు కంపెనీలకు కొమ్ముకాస్తూ ప్రభుత్వం ఆ అభ్యర్థనను తోసిపుచ్చడం శోచనీయం.
**హక్కుల సాధనే లక్ష్యంగా..**
కొన్ని జిల్లాలకు పరిమితమైన సంఘం, నేడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి సమష్టి భాగస్వామ్యంతో ఆయిల్ పామ్ రాష్ట్ర సంఘంగా ఏర్పడబోతోంది. దేశం వంటనూనెల రంగంలో స్వయంసమృద్ధి సాధించడంలో కీలకంగా వ్యవహరిస్తూనే, రైతుల అభ్యున్నతి కోసం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
జన్యుపరమైన లోపాలతో నష్టపోయిన రైతులకు పరిహారం సాధించడం, నాణ్యమైన మొక్కలు ఇవ్వని కంపెనీల నుండి నష్టపరిహారం రాబట్టేలా విత్తన చట్టంలో ఆయిల్ పామ్‌ను చేర్చడం సంఘం ప్రాథమిక లక్ష్యాలు. పండ్లు కొనుగోలు చేసేటప్పుడు ప్రైవేటు కంపెనీలు సాగిస్తున్న దోపిడీ (తరుగు తీసే విధానాన్ని) అడ్డుకోవడానికి పోరాటం కొనసాగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న దిగుబడులకు అనుగుణంగా అశ్వారావుపేటలో 60 టి పిహెచ్ నూతన ఫ్యాక్టరీ నిర్మాణం, కల్లూరుగూడెంలో ఫ్యాక్టరీ పనుల వేగవంతం, ములకలపల్లి లేదా పాల్వంచలో మరొక కొత్త ఫ్యాక్టరీ నిర్మాణంతో పాటు అప్పారావుపేట సామర్థ్యాన్ని 90 టి పి హెచ్ కు పెంచేలా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురానున్నారు. ఇతర జిల్లాల్లో ఒప్పందాల ప్రకారం ప్రైవేటు పరిశ్రమలు వెంటనే స్థాపించేలా ప్రభుత్వంపై పోరాడనున్నారు.
పారదర్శకత అనేది రైతు ప్రాథమిక హక్కు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉత్పత్తవుతున్న 70,000 టన్నుల క్రూడ్ ఆయిల్ ప్రాసెసింగ్ కోసం ఖమ్మంలో మొదటి రిఫైనరీ, ఆ తర్వాత సిద్దిపేటలో మరొకటి నిర్మించేలా కృషి జరుగుతోంది. ప్రతి రైతుకు సంబంధించిన సర్వే నంబర్, మొక్కల రకం, బ్యాచ్ నెంబర్, సరఫరా వివరాలు, చెల్లింపులు అన్నీ పారదర్శకంగా మొబైల్ యాప్ ద్వారా అందుబాటులోకి తేవాలి. ప్రతి నెలా రేట్ ఫిక్సేషన్ వివరాలను ( శాతం, క్రూడ్ సేల్స్, కెర్నల్ నట్ సేల్స్) రైతు సంఘాలతో పంచుకోవడంతో పాటు, కెర్నల్ ఆయిల్ ప్రాసెస్ చేసి ఆయిల్ సేల్ మీద కాకుండా నట్ సేల్ మీదే ధరను నిర్ణయించే విధానాన్ని తీసుకురావాలి.
పర్యావరణ హిత వ్యవసాయం, రైతుల సాధికారతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫ్యాక్టరీల్లో బయోమాస్ పవర్ ప్లాంట్లకు బదులు సోలార్ వాడాలని, తద్వారా మిగిలే బంచ్ ఫైబర్, పామ్ ఫైబర్ వంటి వాటిని సేంద్రీయ ఎరువులుగా రైతులకు తక్కువ ధరకు అందించాలి. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కంపెనీలు రైతులను బానిసల్లా చూడటం మాని, భాగస్వాములుగా గౌరవించే సంస్కృతిని తీసుకురావాలి. సబ్సిడీలు నేరుగా రైతులకు అందేలా చూడటం, ఎన్ఎంఈఓ – ఓ పి స్కీమ్ కింద ఫార్మ్ మెకనైజేషన్ వసతులు కల్పించడం సంఘం ముందున్న కర్తవ్యాలు. ఫ్రూట్ కలెక్షన్ సెంటర్లను రైతుల దరిదాపుల్లోనే ఏర్పాటు చేయాలి, వీటి కేటాయింపుల్లో ఎఫ్పీఓలకు , కోఆపరేటివ్ సొసైటీలకు, డ్వాక్రా సంఘాలకు పెద్దపీట వేయాలి. ఫ్యాక్టరీల సీఎస్సార్ ఫండ్స్‌ను కేవలం రైతుల తోటల రహదారుల అభివృద్ధికి, స్థానిక మౌలిక సదుపాయాలకే వాడాలి. గత ఐదేళ్లుగా పెంచని రవాణా ఛార్జీలను ప్రస్తుత ట్రాక్టర్ కిరాయిలకు అనుగుణంగా 50 శాతం పెంచాలి.
రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించడంలో సంఘం ముందుంటుంది. తెలంగాణలో ఐఐఓపీఆర్ ప్రాంతీయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతి జిల్లాలో మోడల్ గార్డెన్స్ ఏర్పాటు చేసి అదనపు సబ్సిడీలు ఇప్పించాలి. సేంద్రీయ వ్యవసాయం, బయో ఫెర్టిలైజర్స్ వాడకం, గానోడర్మ, స్టెమ్ వెట్రాట్, తెల్లదోమ వంటి తెగుళ్ల నివారణ, నీటి యాజమాన్యం, అంతర పంటలపై రైతులకు నిరంతర శిక్షణ అందించాలి. కంపెనీ ఫీల్డ్ స్టాఫ్, హార్టికల్చర్ అధికారులు నిరంతరం తోటలను పర్యవేక్షిస్తూ సరైన సూచనలు ఇవ్వాలి.
ఇలా అశ్వారావుపేట కేంద్రంగా ఉద్భవించిన ఆయిల్ పామ్ రైతు సంఘం, నేడు రాష్ట్ర స్థాయికి ఎదిగి ప్రతి రైతు కంటతడి తుడవడానికి, కార్పొరేట్ సంస్థల దోపిడీని అడ్డుకోవడానికి ఒక కవచంలా నిలబడింది. రైతుల చెమట చుక్కలు లాభాలుగా మారుతున్న పరిశ్రమల్లో, అదే రైతును చక్రవర్తిగా నిలబెట్టే వరకు ఈ సంఘం పోరాటం అనవరతం కొనసాగుతూనే ఉంటుంది.








