Mahaa Daily Exclusive

  మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం….

Share

మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.
* గంజాయి రహిత ఖమ్మమే లక్ష్యం.
* పోలీస్ కమిషనర్ సునీల్ దత్.
ఖమ్మం, మహా.
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతోంది. గత ఆరు నెలల్లో రూ.2.24 కోట్ల విలువైన 450 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 55 కేసులు నమోదు చేయగా, 123 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని ఆయన తెలిపారు.
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో సునీల్ దత్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా టాస్క్ ఫోర్స్, ఈగల్ ఫోర్స్, స్థానిక పోలీసుల సమన్వయంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పనిచేస్తున్నామని చెప్పారు. సరిహద్దు రవాణా మార్గాలపై నిఘాను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు జాతీయ రహదారులపై నిరంతర వాహన తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ రవాణా ముఠాల కదలికలను అడ్డుకుంటున్నామని వివరించారు.
గంజాయి సరఫరా మార్గాలను గుర్తించేందుకు సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని, కచ్చితమైన సమాచారంతో దాడులు చేసి అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను ఛేదిస్తున్నామని తెలిపారు. గత ఆరు నెలల్లో నమోదైన 55 కేసుల్లో రూ.2 కోట్ల 24 లక్షల విలువ చేసే 450 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు 123 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గంజాయి రవాణాకు పాల్పడిన 20 మంది, విక్రయాల్లో పాల్గొన్న 60 మంది, వినియోగించిన 70 మందిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
గంజాయి మూలాలను గుర్తించి పూర్తిస్థాయిలో నిర్మూలించడమే పోలీసు శాఖ లక్ష్యమని సునీల్ దత్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో నిరంతర దాడులు నిర్వహిస్తూ అనుమానితులను విచారిస్తున్నామని, గంజాయి ఎక్కడి నుంచి జిల్లాకు చేరుతోందనే అంశంపై కీలక సమాచారాన్ని ఇప్పటికే సేకరించినట్లు తెలిపారు. అక్రమ రవాణా ముఠాల మూలాలను పూర్తిగా ఛేదించి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
మాదకద్రవ్యాల బారిన యువత పడకుండా కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సూచించారు. గంజాయి రవాణా, విక్రయాలు లేదా సాగుకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతో ఖమ్మం జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడం సాధ్యమవుతుందని అన్నారు.
గంజాయి విక్రయాలకు పాల్పడే వారిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కఠిన కేసులు నమోదు చేస్తున్నామని, అక్రమ రవాణా చేసే వారిపై అవసరమైతే పీడీ చట్టం కూడా ప్రయోగిస్తామని హెచ్చరించారు. గంజాయి వినియోగం నేరాలకు దారితీసే ప్రమాదం ఉన్నందున విద్యాసంస్థలు, గ్రామాలు, కాలనీల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
పోలీసు అధికారులు గ్రామాలను తరచూ సందర్శించి ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవడంతో పాటు స్థానిక సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. గంజాయి సరఫరాదారులు యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో సివిల్ డ్రస్‌లో ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపుతున్నామని తెలిపారు. ముఖ్యంగా లాడ్జీలు, బస్టాండ్లు, కళాశాలలు, గ్రంథాలయాలు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ అక్రమ నిల్వలు, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు.