షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక మలుపు.
* నిందితుడు రాజ్‌కుమార్ మృతి.
* సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో గుర్తించిన పోలీసులు.
రంగారెడ్డి, మహా.
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురు హత్యకు గురైన సంచలన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహం సోమవారం కొత్తూరు మండలం పంజర్ల గ్రామ పరిసరాల్లో లభ్యమైంది. మృతదేహం సమీపంలో విషం సీసా కూడా లభించడంతో అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. రాజ్‌కుమార్ మేనమామ గ్రామమైన పంజర్లలో ఈ ఘటన చోటుచేసుకోవడం దర్యాప్తులో మరో కీలక అంశంగా మారింది.
ఘటన స్థలంలో లభించిన రాజ్‌కుమార్ సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించగా, అందులో ఒక సెల్ఫీ వీడియో ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, హత్యలకు ముందు రోజు అయిన జూలై 10న ఆ వీడియోను రికార్డు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అందులో తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, బాలికను నమ్మి మోసపోయానని, జీవితంపై విరక్తి కలిగిందని పేర్కొన్నట్లు సమాచారం. అయితే వీడియోలోని విషయాలపై పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
సంఘటన స్థలాన్ని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, మరణానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. సెల్ఫోన్లో లభించిన వీడియో, ఫోరెన్సిక్ ఆధారాలు, ఇతర సాంకేతిక సమాచారాన్ని పరిశీలించి కేసు దర్యాప్తును పూర్తి చేస్తామని పోలీసులు వెల్లడించారు.
కాగా, రాజ్‌కుమార్‌పై గతంలో నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో కక్షతో షాబాద్‌లో బాలిక, ఆమె కుటుంబ సభ్యులతో పాటు తన భార్య, ఇద్దరు చిన్నారులను కలిపి మొత్తం ఆరుగురిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించగా, నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు విస్తృత గాలింపు చేపట్టిన విషయం తెలిసిందే.








