మెరిట్ ఆధారంగానే బీసీ గురుకుల సీట్ల కేటాయింపు.
* మధ్యవర్తులను నమ్మొద్దు.. కార్యదర్శి బడుగు సైదులు.
హైదరాబాద్, మహా.
మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పూర్తిగా మెరిట్ ప్రాతిపదికననే జరుగుతున్నాయని సంస్థ కార్యదర్శి బడుగు సైదులు స్పష్టం చేశారు. సీట్ల కోసం హెడ్ ఆఫీస్, ప్రాంతీయ కార్యాలయాలు లేదా పాఠశాలల చుట్టూ తిరగవద్దని, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
సోమవారం విడుదల చేసిన ప్రకటనలో బడుగు సైదులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలు పారదర్శకంగా మెరిట్ ఆధారంగానే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మొదటి, రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తయిందని, ఐదో తరగతితో పాటు ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్లు లేదా ఖాళీలు మిగిలి ఉంటే ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత, మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని వివరించారు.
ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఎక్కడైనా ఖాళీ సీట్లు ఉంటే ఆయా కళాశాలల్లో నిబంధనల ప్రకారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమాచారం అధికారికంగా వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఈ విద్యా సంవత్సరంలో గురుకుల సీట్లకు భారీ పోటీ నెలకొన్న నేపథ్యంలో సీటు రాని విద్యార్థులు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం, ప్రాంతీయ సమన్వయ కార్యాలయాలు లేదా పాఠశాలలకు వచ్చి సమయం వృథా చేసుకోవద్దని సూచించారు. కార్యాలయాల్లో ఎలాంటి కొత్త దరఖాస్తులు స్వీకరించబోమని, కార్యాలయాలకు వచ్చినా సీట్ల కేటాయింపులో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
సీట్లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా లేదా ప్రలోభాలకు గురిచేసినా వారి మాటలను నమ్మవద్దని బడుగు సైదులు హెచ్చరించారు. అలాంటి వ్యక్తుల వివరాలను 040-23120496 నంబర్‌కు తెలియజేయాలని కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేసే మధ్యవర్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ప్రవేశ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, మెరిట్ ఆధారంగానే కొనసాగుతుందని, విద్యార్థులు అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని బడుగు సైదులు విజ్ఞప్తి చేశారు.








