అనకాపల్లి,మహా.
సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు చేసి చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో సైబర్ నేరాలు, సోషల్ మీడియా సంబంధిత కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సోమవారం అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో హోం మంత్రి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి వారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు.
అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తూ బాధితులకు న్యాయం చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువయ్యేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
జిల్లాలో ఈ ఏడాది నేరాల శాతం 15 శాతం మేర తగ్గిందని హోం మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాల్లో 7 శాతం తగ్గుదల నమోదైందని పేర్కొన్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, పోలీసు శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందని అన్నారు.
సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తప్పుడు సమాచారం, అసత్య ప్రచారం లేదా చట్టవిరుద్ధమైన పోస్టులు చేసే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని హోం మంత్రి స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వంగలపూడి అనిత విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.








