Mahaa Daily Exclusive

  టీజీ టెట్–2026 ఫలితాలు విడుదల….

Share

టీజీ టెట్–2026 ఫలితాలు విడుదల.
* 43.94 శాతం ఉత్తీర్ణత…50,544 మంది అర్హత.
హైదరాబాద్, మహా.
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్–2026) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను పరిశీలించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈసారి పరీక్షలో మొత్తం 50,544 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, ఉత్తీర్ణత శాతం 43.94గా నమోదైంది.

జూన్ 16 నుంచి 22 వరకు పది సెషన్లలో నిర్వహించిన టీజీ టెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 1,53,752 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,15,028 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 23,623 మంది ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు కాగా, 91,405 మంది ఇతర అభ్యర్థులు ఉన్నారు.

ఫలితాల ప్రకారం మొత్తం 50,544 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ఎస్టీ అభ్యర్థులు 51.03 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచారు. అనంతరం బీసీ అభ్యర్థులు 40.36 శాతం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 22.43 శాతం, జనరల్ వర్గం అభ్యర్థులు 20.15 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఈ ఏడాది టీజీ టెట్‌లో మహిళా అభ్యర్థులు పురుషుల కంటే మెరుగైన ఫలితాలు నమోదు చేయడం విశేషంగా నిలిచింది. పేపర్–1లో పరీక్ష రాసిన నలుగురు ట్రాన్స్‌జెండర్ అభ్యర్థుల్లో ఇద్దరు అర్హత సాధించారు.

పేపర్–2 (గణితం) విభాగంలో 32,555 మంది మహిళలు పరీక్షకు హాజరుకాగా, వారిలో 12,495 మంది అర్హత సాధించారు. అదే విభాగంలో 11,567 మంది పురుషులు పరీక్ష రాయగా 5,488 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆరుగురు ట్రాన్స్‌జెండర్ అభ్యర్థుల్లో నలుగురు అర్హత సాధించడం ప్రత్యేకంగా నిలిచింది.

పేపర్–2 (సామాజిక శాస్త్రం) విభాగంలో 23,008 మంది మహిళలు పరీక్ష రాయగా, 5,009 మంది అర్హత సాధించారు. అన్ని విభాగాల్లోనూ మహిళల ఉత్తీర్ణత శాతం పురుషుల కంటే మెరుగ్గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలతో పాటు మార్కులు, అర్హత వివరాలను పరిశీలించుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ సూచించింది.