ఈటెల ధిక్కారస్వరం..!
• నాకు కమలం కంటే తెలంగాణే ముఖ్యం’
• కమలనాథులకు షాకిచ్చిన మాజీ మంత్రి!
• కాళేశ్వరం కేంద్రంగా రగులుతున్న రాజకీయ జ్వాల.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాజకీయ చదరంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరూ ఊహించని సరికొత్త మలుపులకు కేంద్రబిందువుగా మారింది. ఒకప్పుడు ఇంజనీరింగ్ అద్భుతంగా కీర్తింపబడి, ఆ తర్వాత కుంగుబాటు వివాదాలతో ప్రతిష్ఠ కోల్పోయిన ఈ ప్రాజెక్టు.. ఇప్పుడు ఏకంగా మూడు ప్రధాన పార్టీల మధ్య అగ్నిగుండంగా రగులుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు ముఖం చాటేసి, కరువు రక్కసి పల్లెలను కబళిస్తున్న వేళ.. బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన ఆయుధాన్ని చేతబట్టింది. లక్ష క్యూసెక్కుల జలరాశితో కళకళలాడుతున్న కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లు ఆన్ చేసి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా బీటలు వారిన బీడు భూములకు ప్రాణం పోయాలని గులాబీ దళం డిమాండ్ చేస్తోంది. అన్నదాతల కన్నీళ్లు తుడుస్తామని, అడ్డుకుంటే ప్రాణత్యాగాలకైనా వెనుకాడబోమని విపక్ష శ్రేణులు ప్రాజెక్టు వైపు దూసుకురావడం, వారిని భారీ మోహరింపుతో పోలీసులు నిలువరించడం రాష్ట్రంలో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. కష్టకాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అసలు సిసలు విలువ ఏంటో ఇప్పుడు సర్కారుకు, రాష్ట్ర ప్రజానీకానికి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని బీఆర్ఎస్ అత్యంత బలంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది.
ఈ జల వివాదంపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అత్యంత పదునైన వాదనతో ప్రతిదాడికి దిగింది. కన్నెపల్లి నుంచి ఒక్కసారిగా జలప్రవాహాన్ని దిగువకు వదిలితే, పెను విధ్వంసం తప్పదని పాలకుల వాదన. గతంలో కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ సాంకేతికతతోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా నిర్మితమయ్యాయని, వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ప్రభుత్వం గుర్తుచేస్తోంది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ ఈ మూడు బ్యారేజీల సామర్థ్యంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, పూర్తి స్థాయి పటిష్టత నిర్ధారణ జరిగే వరకు చుక్క నీరు కూడా నిల్వ చేయకూడదని ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం ఉటంకిస్తోంది. ఒకవేళ ప్రతిపక్షాల ఉచ్చులో పడి నీటిని విడుదల చేస్తే, ఆ బ్యారేజీలు ఒత్తిడికి తట్టుకోలేక కుప్పకూలిపోతాయని, అదే జరిగితే దిగువన ఉన్న భద్రాచలం పట్టణంతో పాటు ఏకంగా 44 గ్రామాలు జలసమాధి కావడం ఖాయమని సర్కారు సంచలన హెచ్చరికలు జారీ చేసింది. సాంకేతిక లోపాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ ఈ ప్రమాదకరమైన జలక్రీడకు తెరతీసిందని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది.
ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న హోరాహోరీ పోరును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా ఒక రాజకీయ డ్రామాగా కొట్టిపారేస్తోంది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు ముఖ్య నాయకులు.. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై ఆడుతున్న కుట్రపూరిత నాటకమని ఆరోపిస్తున్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఆ బ్యారేజీల మరమ్మతులకు ప్రభుత్వం ఎందుకు పూనుకోలేదని, రైతుల జీవితాలతో ఎందుకు చెలగాటం ఆడుతోందని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇక్కడే తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని కుదిపేసే అతి పెద్ద సంచలనం తెరపైకి వచ్చింది. జాతీయ స్థాయి నాయకత్వానికి అత్యంత సన్నిహితుడిగా, మల్కాజిగిరి ఎంపీగా ఉన్న కమలనాథుడు ఈటల రాజేందర్ అనూహ్యంగా పార్టీ గీత దాటి బీఆర్ఎస్ డిమాండ్‌ను సమర్థించడం అధికార, ప్రతిపక్ష శిబిరాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. కన్నెపల్లి నుంచి నీటిని వదిలితే బ్యారేజీలకు ఎలాంటి ముప్పు లేదని, రాష్ట్ర రైతాంగాన్ని రక్షించుకోవాలంటే తక్షణమే మోటార్లు ఆన్ చేయాల్సిందేనని ఆయన చేసిన డిమాండ్ కాషాయ దళాన్ని సైతం తీవ్ర ఆత్మరక్షణలో పడేసింది.
ఈటల రాజేందర్ నోటి వెంట వచ్చిన ఈ సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్కు అనూహ్యమైన రాజకీయ లబ్ధిని చేకూరుస్తున్నాయని పసిగట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తనదైన శైలిలో పదునైన వ్యూహంతో దాడికి దిగారు. ఈటల మాట్లాడుతున్నది ఆయన సొంత మాటలు కావని, ఆ స్క్రిప్ట్ వెనుక సూత్రధారి మాజీ మంత్రి హరీశ్ రావు అని రేవంత్ ఆరోపించడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఈ ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడిన ఈటల రాజేందర్.. ముఖ్యమంత్రికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఎవరి అజెండానో మోయాల్సిన ఖర్మ తనకు లేదని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రైతుల పక్షానే తన గళం వినిపిస్తుందని స్పష్టం చేశారు. ‘బీజేపీ జాతీయ నాయకత్వానికి ‘నేషన్ ఫస్ట్’ (దేశమే ప్రథమం) సిద్ధాంతం ఉండొచ్చు.. కానీ నా గుండెచప్పుడు, నా ఫిలాసఫీ ఎప్పుడూ ‘తెలంగాణ ఫస్ట్’ (నా రాష్ట్రమే ప్రథమం) మాత్రమే’ అని ఆయన చేసిన సింహగర్జన రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. రైతుల ప్రయోజనాల ముందు రాజకీయ లాభనష్టాలు తనకు ఆవగింజ అంత అని ఆయన తేల్చిచెప్పారు. ఈటల రాజేందర్ ఈ తరహా సంచలనాలకు కేంద్ర బిందువు కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ దశలో అత్యంత కీలకమైన మంత్రి హోదాలో పనిచేసిన అనుభవంతోనే ఆయన ఆ ప్రాజెక్టు డిజైన్, సామర్థ్యంపై ఇంతటి ధీమాగా మాట్లాడుతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఒక జాతీయ పార్టీలో కీలక పదవిలో ఉన్న నాయకుడు, అందులోనూ క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో ఉంటూ.. ఇలా బహిరంగంగా పార్టీ అధీకృత లైన్‌కు భిన్నంగా సొంత నిర్ణయాన్ని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తప్పు చేస్తోందని ఆయన నిజంగా నమ్మితే, పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఒప్పించి దానిని బీజేపీ ఉమ్మడి అజెండాగా మార్చాల్సింది. అలా చేయకుండా ఒంటరి పోరాటం చేయడం ద్వారా, పరోక్షంగా తెలంగాణ బీజేపీలో తనకు సాటిరాగల, తనంతటి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు మరొకరు లేరనే సంకేతాన్ని ఆయన ప్రజల్లోకి పంపారు. ఆయన వ్యాఖ్యలు కాషాయ శ్రేణులను సైతం ఒకరకమైన అయోమయంలోకి నెట్టేశాయి.
గతాన్ని ఒకసారి పరిశీలిస్తే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఈటల రాజేందర్ ఇదే తరహా తెగువను ప్రదర్శించారు. ‘నేను ఎవరి దయతోనో ఇక్కడ లేను.. ఈ పార్టీ జెండాకు ఓనర్లలో నేను కూడా ఒకడిని, నన్ను ఎవరూ పంపించలేరు’ అని ఏకంగా అధినేతకే సవాల్ విసిరిన ఘన చరిత్ర ఆయన సొంతం. ఇప్పుడు ఆ పార్టీని వీడి కమలం గూటికి చేరినా.. ఆయన విలక్షణమైన రాజకీయ శైలి, వ్యక్తిత్వం ఏమాత్రం మారలేదని తాజా ఎపిసోడ్ స్పష్టం చేస్తోంది. ఏ పార్టీలో ఉన్నా, తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉందని, ప్రజల కోసం ఎవరినైనా ఎదిరించగల సత్తా తన సొంతమని ఆయన ఈ కాళేశ్వరం పంచాయితీ ద్వారా నిరూపించుకునే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యల వల్ల ప్రత్యర్థికి అడ్వాంటేజ్ వచ్చినా తాను వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్న ఈటల వైఖరి.. రాబోయే రోజుల్లో రాష్ట్ర బీజేపీ అంతర్గత రాజకీయాల్లో ఎలాంటి చిచ్చు రేపుతుందో, తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ఇంకెన్ని సంచలనాలకు దారితీస్తుందో చూడాలి. ఏది ఏమైనా, కాళేశ్వరం జలాల చుట్టూ ఇప్పుడు నీళ్ల కన్నా ఎక్కువగా రాజకీయ అగ్ని కీలలే ఎగసిపడుతున్నాయి.








