Mahaa Daily Exclusive

  ఎల్-నినో ప్రభావంపై అప్రమత్తం….

Share

ఎల్-నినో ప్రభావంపై అప్రమత్తం.
* రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు కార్యాచరణకు ప్రభుత్వం సిద్ధం.
* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావం వల్ల తలెత్తే వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలను చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఇక్రిశాట్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షపాతం పరిస్థితులను ప్రతిరోజూ జిల్లా వారీగా సమీక్షిస్తూ రైతులకు శాస్త్రీయ సూచనలు అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల పరిస్థితులను సమీక్షించగా 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని, మిగిలిన 20 జిల్లాల్లో వర్షపాతం లోటు కొనసాగుతోందని మంత్రి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఉన్న జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సమన్వయంతో పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన చర్యలను వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు. శాస్త్రవేత్తలు సూచించే ప్రతి యాజమాన్య చర్య రైతుల వరకు చేరేలా వ్యవసాయ శాఖ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు.

ఎల్-నినో ప్రభావాన్ని శాస్త్రీయ విధానాలతో ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో డిఎస్ఆర్ విధానాన్ని అమలు చేయాలని మంత్రి సూచించారు. ఆగస్టు నెలాఖరు వరకు ప్రతి వారం ప్రత్యేక బులెటిన్ విడుదల చేయాలని, అందులో మండలాల వారీగా నమోదైన వర్షపాతం, రానున్న వారానికి, నెలాఖరు వరకు ఉండే వాతావరణ పరిస్థితుల అంచనాలను పొందుపరచాలని తెలిపారు. డ్రై స్పెల్స్ ఏర్పడే అవకాశాలు, గరిష్ఠ-కనిష్ఠ ఉష్ణోగ్రతలు, నేల తేమ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యత, సాగునీటి పరిస్థితి, విద్యుత్ సరఫరా, పంటల స్థితిగతులు, రైతులు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలపై సమగ్ర సమాచారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

నీటిపారుదల శాఖతో సమన్వయం చేసుకుని ప్రాజెక్టుల క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో ఈ నెల, వచ్చే నెల వాతావరణ అంచనాలను విశ్లేషించాలని మంత్రి సూచించారు. ఆయా ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉండే నీటి నిల్వలు, ఇన్‌ఫ్లోలు, సాగునీటి లభ్యతపై ఖచ్చితమైన అంచనాలను కూడా వారపు బులెటిన్‌లో పొందుపరచాలని స్పష్టం చేశారు. రైతు వేదికలు, గ్రామపంచాయతీలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సామాజిక మాధ్యమాలు, స్థానిక మీడియా ద్వారా ఈ బులెటిన్‌ను విస్తృతంగా రైతులకు చేరవేసి శాస్త్రీయ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించారు.

సమావేశం అనంతరం వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల కంటింజెన్సీ ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను ప్రాతిపదికగా తీసుకుని కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా జిల్లా వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు చెప్పారు.

వర్షాలు ఆలస్యమైతే అవసరమయ్యే విత్తనాలపై ముందుగానే అంచనా వేసి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జూలై 15 వరకు వర్షాలు ఆలస్యమైతే 16.30 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, జూలై 30 వరకు ఆలస్యమైతే 13.82 లక్షల క్వింటాళ్లు, ఆగస్టు 15 వరకు వర్షాభావ పరిస్థితులు కొనసాగితే 12.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేసి వాటిని ముందుగానే అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

వరి రైతులు శాస్త్రవేత్తల సూచనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి సూచించారు. నారుమడి దశలో ఉన్న రైతులు నారు పీకడానికి వారం రోజుల ముందు ఎకరానికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3 సీజీ గ్రాన్యూల్స్ వేయాలని, నాటే సమయంలో నారు ఆకుల చివరలను కత్తిరించి నాటాలని సూచించారు. 15×10 సెంటీమీటర్ల దూరంతో దగ్గరగా నాటి ప్రతి గుంతలో 6 నుంచి 8 మొక్కలు ఉంచాలని తెలిపారు. సిఫార్సు చేసిన మోతాదుతో పోలిస్తే 25 శాతం అదనపు నత్రజని ఇవ్వాలని, మొత్తం నత్రజనిలో 70 శాతం నాటే సమయంలో, మిగిలిన 30 శాతం పూత ప్రారంభ దశలో వేయాలని సూచించారు.

ఇంకా నారు వేయని రైతులు తక్కువ వ్యవధిలో దిగుబడి ఇచ్చే వరి రకాలతో డ్రై డైరెక్ట్ సీడెడ్ రైస్ విధానాన్ని అనుసరించాలని వ్యవసాయ శాఖ సూచించింది. కాలువల ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యతను బట్టి వరికి బదులుగా మొక్కజొన్న, సజ్జలు, రాగులు, కందులు, మినుములు, పొద్దుతిరుగుడు, నువ్వులు, అలసందలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించింది. ప్రస్తుతం మొలక దశలో ఉన్న మొక్కజొన్న, పత్తి పంటలకు రాబోయే రెండు వారాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగితే నేల తేమను కాపాడేందుకు కలుపు నియంత్రణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు.

రాష్ట్రంలో అవసరమైన విత్తనాలు, ఎరువులపై ఇప్పటికే సమగ్ర అంచనా పూర్తి చేశామని, మూడు దశల కంటింజెన్సీ ప్రణాళికలకు అనుగుణంగా అవసరమైన విత్తనాలను ముందుగానే సమీకరించినట్లు అధికారులు తెలిపారు. మార్క్‌ఫెడ్‌, విత్తన సంస్థలు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రైతులకు ఎలాంటి కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ సాగు విధానాలు, నీటి యాజమాన్యం, నేల తేమ సంరక్షణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ పద్ధతులు, శాస్త్రవేత్తలు సూచించిన యాజమాన్య చర్యలపై రైతులకు ప్రత్యేక అవగాహన కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి రైతు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకునేలా గ్రామస్థాయిలో వ్యవసాయ అధికారులు నిరంతరం మార్గనిర్దేశం చేస్తారని ఆయన స్పష్టం చేశారు.