- ఈనెల 24 వరకు ఎస్ఐఆర్ గడువు.!
- ఎస్ఐఆర్–2026 ప్రక్రియ పూర్తి చేయడమే లక్ష్యం
- అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో జిల్లా యంత్రాంగం విస్తృత చర్యలు
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి జిల్లా అధికారులతో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్–2026) ప్రక్రియ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్–2026) ప్రక్రియను జూలై 24 చివరి తేదీలోగా పూర్తి చేయడం జిల్లా యంత్రాంగం లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బంది, స్థానిక సంస్థల సిబ్బంది, ప్రత్యేక బృందాలను సమన్వయంతో వినియోగిస్తూ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, పరిశీలన, డిజిటైజేషన్ పనులను వేగవంతంగా చేపడుతున్నట్లు తెలిపారు.
ఎస్ఐఆర్ (ఎస్ఐఆర్–2026) ప్రక్రియపై అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ప్రత్యేక ఒరియెంటేషన్ కార్యక్రమాలు నిర్వహించి, ప్రక్రియ నిర్వహణ, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, పరిశీలన, డిజిటైజేషన్ తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో సమన్వయంతో విధులు నిర్వహించేలా అవసరమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ప్రతి అర్హత గల ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం చేరేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. ఫారాలు పూర్తి వివరాలతో సేకరించి, నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తిచేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందన్నారు.
అర్హులైన ఓటర్లు ఎవరూ ఈ అవకాశాన్ని కోల్పోకుండా జూలై 24లోగా తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి వివరాలతో సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (బిఎల్ఓ) తప్పనిసరిగా అందజేసి ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్–2026) ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.








