ఖమ్మం గడ్డపై కాషాయ జెండా ఎగరడం తథ్యం.
• మోదీ సుపరిపాలనతోనే ఖమ్మం అభివృద్ధి.
• కాంగ్రెస్, కమ్యూనిస్టులవి అవకాశవాద రాజకీయాలు.
* బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్ రావు.
వైరా, జులై 14.
దశాబ్దాలుగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల అవకాశవాద రాజకీయాలకు బలైపోయిన ఖమ్మం జిల్లాలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నేతలు శక్తివంచన లేకుండా పని చేయాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ గౌతమ్ రావు అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా వైరాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ.. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, కమ్యూనిస్టుల అవకాశవాద రాజకీయాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఖమ్మం పోరాట గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు. కార్యక్రమం కు ముందు అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా కార్యవర్గ సమావేశం లో రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు జిల్లా పార్టీ చేసిన కార్యాచరణ అంశాలపై తీర్మానం ప్రవేశపెట్టారు. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
దశాబ్దాలుగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్, కమ్యూనిస్టుల స్వార్థ రాజకీయాలకు బలైపోయిందని గౌతమ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక చైతన్యం ఉన్న ఈ గడ్డపై కార్మికులు, కర్షకుల పేరుతో రాజకీయాలు చేసిన కమ్యూనిస్టులు నేడు తమ సిద్ధాంతాలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. కేవలం కొన్ని పదవుల కోసం, తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం ఎర్ర జెండా నాయకులు అధికార కాంగ్రెస్తో అంటకాగుతూ ప్రజల నమ్మకాన్ని నడివీధిలో వమ్ము చేశారని విమర్శించారు. ఈ రెండు పార్టీల అపవిత్ర కలయిక వల్ల సామాన్యుల తలరాతలు ఏమాత్రం మారలేదని, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఏమాత్రం పనికిరాని ఈ నకిలీ కామ్రేడ్లు, అవినీతి కాంగ్రెస్ నాయకులు ఖమ్మం జిల్లాను తమ గుప్పిట్లో పెట్టుకుని శాసించాలని చూస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రంలో ఇలాంటి వినాశకర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, ఖమ్మం జిల్లాకు ఏకైక ప్రత్యామ్నాయ శక్తి భారతీయ జనతా పార్టీ మాత్రమేనని గౌతమ్ రావు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలనలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని, ఆ నిస్వార్థ అభివృద్ధి ఫలాలు ఖమ్మం గడపకు కూడా చేరుతున్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా వేల కోట్ల రూపాయలతో మన జిల్లా మీదుగా జాతీయ రహదారులను నిర్మిస్తూ, ఖమ్మం రైల్వే స్టేషన్ను ఆధునికీకరిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోందని గుర్తుచేశారు. పేదల పక్షపాతిగా మోదీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలు దళారులు, అవినీతికి తావులేకుండా నేరుగా నిరుపేద లబ్ధిదారుల ఖాతాల్లోకే చేరుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కుల మతాల మధ్య చిచ్చుపెట్టి చౌకబారు రాజకీయాలు చేస్తుంటే, బీజేపీ ‘సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్’ నినాదంతో ముందుకు సాగుతోందన్నారు.
ఖమ్మం జిల్లాలోని గిరిజనులు, దళితులు, బీసీలు, ఇతర అణగారిన వర్గాల నిజమైన ఆత్మగౌరవం బీజేపీతోనే సాధ్యమవుతుందని ఆయన పార్టీ శ్రేణులకు వివరించారు. దశాబ్దాలుగా గిరిజనులను వేధిస్తున్న పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నా, సీతారామ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం జరగాలన్నా, సింగరేణి కార్మికుల కష్టాలు తీరాలన్నా అది పారదర్శకమైన, అవినీతి రహితమైన బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ వాస్తవాలను గ్రహించి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో ప్రతి గడపకూ, ప్రతి తండాకూ వెళ్లి మోదీ ప్రభుత్వ అభివృద్ధి సందేశాన్ని బలంగా వినిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు వాకధాని పుల్లారావు యాదవ్, నంబూరి రామలింగేశ్వరరావు, సన్నీ ఉదయ ప్రతాప్, గోగూర వెంకటేశ్వర్లు, గల్లా సత్యనారాయణ, ఇవి రమేష్, రుద్ర ప్రదీప్, దొంగల సత్యనారాయణ, చిలుకూరి రమేష్,నున్న రవికుమార్, మండడపు సుబ్బారావు,మేకల నాగేందర్, గుత్తా వెంకటేశ్వర్లు,నాయుడు రాఘవరావు, బండారు నరేష్, శ్యామ్ రాథోడ్, మంద సరస్వతి,బోయలు వెంకట్, పమ్మీ అనిత, వీరవల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.







