Mahaa Daily Exclusive

  పాక్ క్రికెట్ జట్లపై మాజీ హోంశాఖ అధికారి ఆరోపణలు….

Share

పాక్ క్రికెట్ జట్లపై మాజీ హోంశాఖ అధికారి ఆరోపణలు.
* షోయబ్ అక్తర్, ఆసిఫ్ పేర్ల ప్రస్తావన
ఢిల్లీ, మహా.
పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చే కొన్ని క్రికెట్ జట్లు, అధికారిక ప్రతినిధి బృందాలను మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వినియోగించేవారని కేంద్ర హోం శాఖ మాజీ అండర్ సెక్రటరీ ఆర్వీఎస్ మణి ఆరోపించారు. 2006 నుంచి 2010 వరకు కేంద్ర హోం శాఖలో పనిచేసిన ఆయన, ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి మాదకద్రవ్యాలను తరలించడం ఆ దేశ ప్రభుత్వ విధానంలో భాగమని ఆయన ఆరోపించారు.

ఆర్వీఎస్ మణి మాట్లాడుతూ, ఉన్నత స్థాయి వ్యక్తులు, క్రీడాకారులను కూడా మాదకద్రవ్యాల అక్రమ రవాణా కోసం ఉపయోగించేవారనే సమాచారం అప్పట్లో తమ వద్ద ఉండేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్ పేర్లను ఆయన ప్రస్తావించారు.

2006లో నిషేధిత అనాబాలిక్ స్టెరాయిడ్ నాండ్రోలోన్ వినియోగానికి సంబంధించిన డోపింగ్ కేసులో షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్‌పై నిషేధం విధించిన విషయాన్ని మణి గుర్తు చేశారు. ఆ సమయంలో ఇద్దరూ భారత్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి ముందు పాకిస్థాన్ జట్టులో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఆ ఘటన తర్వాత పాకిస్థాన్ హైకమిషన్ జోక్యంతో వారిని హుటాహుటిన స్వదేశానికి పంపించారని, ఆ పరిణామాలపై తాను అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.