ఢిల్లీ, మహా.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026–27లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగాయి. జూలై 13 నాటికి దేశవ్యాప్తంగా రూ.7,73,681.68 కోట్ల స్థూల ప్రత్యక్ష పన్నులు వసూలైనట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.11 శాతం వృద్ధి నమోదైంది. ఈ వసూళ్లలో కార్పొరేట్ పన్ను రూ.3,35,386.27 కోట్లు, కార్పొరేట్ేతర పన్ను రూ.4,11,853.80 కోట్లుగా ఉన్నాయి. అదనంగా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ద్వారా రూ.26,428.96 కోట్లు వసూలయ్యాయి.
ఇక పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం రూ.1,22,491.87 కోట్ల రీఫండ్లు జారీ చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14.57 శాతం అధికం.
రీఫండ్లను మినహాయించిన తర్వాత నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6,51,189.81 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర వసూళ్లలో 16.40 శాతం వృద్ధి నమోదైంది.
ఆర్థిక కార్యకలాపాల విస్తరణ, మెరుగైన పన్ను అనుసరణ, డిజిటల్ పన్ను పరిపాలన వల్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.






