Mahaa Daily Exclusive

  2028 జూన్ 2 నాటికి విమానాశ్రయాలు ప్రారంభం:సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి.

Share

ఢిల్లీ, మహా.
తెలంగాణలో విమానయాన మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2028 జూన్ 2 నాటికి వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలను ప్రారంభించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఢిల్లీలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర అభివృద్ధిలో విమానాశ్రయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ, కేంద్ర అనుమతులు, నిర్మాణం, ప్రారంభం అనే నాలుగు కీలక దశలపై ప్రభుత్వం వేగంగా పనిచేస్తోందని సీఎం తెలిపారు. కాకతీయుల చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా వరంగల్ విమానాశ్రయాన్ని ప్రత్యేక నమూనాలో నిర్మిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రాన్ని 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, ఎగుమతులు పెరగాలంటే అంతర్జాతీయ ప్రమాణాల విమానాశ్రయాలు అత్యవసరమని అన్నారు. తెలంగాణ ఇప్పటికే దేశ స్థూల దేశీయోత్పత్తికి ఐదు శాతం వాటా అందిస్తోందని గుర్తుచేస్తూ, రాష్ట్ర అభివృద్ధికి విమానయాన రంగాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని వివరించారు.
కొన్ని సమస్యలకు చర్చలే పరిష్కారమని, అందుకే తరచూ ఢిల్లీకి వస్తున్నానని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులను కలిసి పెండింగ్ ప్రాజెక్టుల ఆమోదం కోరుతున్నామని, తన ఢిల్లీ పర్యటనలపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని తెలిపారు. కేంద్రంతో సఖ్యతతో పనిచేస్తూ తెలంగాణకు అవసరమైన అన్ని ప్రాజెక్టులను సాధించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, వరంగల్ విమానాశ్రయం నిర్మాణ పనులను మూడు వారాల్లో ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. 2028 జూన్ 2 నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆదిలాబాద్ విమానాశ్రయం విషయంలో రక్షణ శాఖ భూముల సమస్య పరిష్కారమైన వెంటనే తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ వేగంగా పూర్తి చేస్తోందని, తమ శాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిసి ప్రాంతీయ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం ఇవ్వాలని, దక్షిణ భాగానికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలోని పలు జాతీయ రహదారి ప్రాజెక్టులు, పెండింగ్ మౌలిక సదుపాయాల పనులపై కూడా వినతిపత్రం సమర్పించారు.
అదేవిధంగా, ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కూడా సీఎం కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, పరిపాలనా అంశాలు, అలాగే రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవుల భర్తీపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.