Mahaa Daily Exclusive

  కరువు–కాళేశ్వరంపై ప్రభుత్వం స్పందించాలి…

Share

కరువు–కాళేశ్వరంపై ప్రభుత్వం స్పందించాలి.
* మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్.

హైదరాబాద్, మహా.
కరువు పరిస్థితులు, కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో “కరువు వర్సెస్ కాళేశ్వరం.. కన్నెపల్లి నుంచి నీటి తరలింపు సాధ్యమేనా?” అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ, తాను కరీంనగర్ జిల్లా వాసినని, హుజూరాబాద్ ప్రజల నీటి కష్టాలను 25 ఏళ్లుగా చూస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఏర్పడుతున్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయ విమర్శలకు బదులుగా రైతులను ఆదుకునే చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, వారిపై చేసిన వ్యాఖ్యలకు సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం వంటి అంశాలపై బాధ్యులెవరైనా వారిపై చర్యలు తీసుకోవాలని, అయితే ఆధారాలు లేకుండా అందరినీ విమర్శించడం సరికాదన్నారు.

తాము ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా మాట్లాడడం లేదని, రైతులు, ప్రజలు, న్యాయం, ధర్మం కోసం మాత్రమే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. శ్రీరాంసాగర్, లోయర్ మానేరు డ్యాంలు లక్షల ఎకరాలకు నీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించినప్పటికీ, పూర్తి సామర్థ్యంతో ఉపయోగించలేకపోయామని గుర్తు చేశారు.

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర కరువు వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని ఈటల పేర్కొన్నారు. ఇప్పటికే పత్తి విత్తనాలు మొలకెత్తేందుకు రైతులు బిందెలతో నీళ్లు పోస్తున్న దుస్థితి నెలకొందని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం వెంటనే సాగునీటి సరఫరాపై నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

కన్నెపల్లి వద్ద భారీగా నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోతోందని, ఆ నీటిని ఎత్తిపోసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు. ఎల్లంపల్లి నుంచి ఎన్‌టీపీసీ, జెన్‌కో, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులు ఉన్నాయని గుర్తుచేస్తూ, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సూచనల మేరకు అవసరమైన అత్యవసర చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాపర్ డ్యామ్ వంటి ప్రత్యామ్నాయ చర్యలపై ఎందుకు ముందడుగు వేయలేదని నిలదీశారు.

రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడం, బెదిరింపు వ్యాఖ్యలు చేయడం తగదని సీఎం రేవంత్ రెడ్డికి సూచించిన ఈటల రాజేందర్, ప్రజా సమస్యల పరిష్కారంపైనే ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. కరువు పరిస్థితులను యుద్ధప్రాతిపదికన ఎదుర్కొని రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత కావాలని అన్నారు.