గడ్చిరోలి,మహా.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మరోసారి మావోయిస్టుల కదలికలు వెలుగులోకి రావడంతో భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎటపల్లి తాలూకాలోని జువేలి, పిప్లి, బుర్గి గ్రామాల్లో మావోయిస్టులు వదిలివెళ్లిన కరపత్రాలను భద్రతా బలగాలు గుర్తించాయి. ఇటీవల మావోయిస్టు అగ్రనేతల ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో ఆ సంస్థ బలహీనపడిందనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
‘అశోక్ కామ్రేడ్’ పేరుతో విడుదలైన ఈ కరపత్రాల్లో ఇనుప ఖనిజ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కొత్తగా ప్రతిపాదిస్తున్న మైనింగ్ ప్రాజెక్టులతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న గనుల తవ్వకాలను కూడా పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచ్‌లు, గ్రామస్థులు కంపెనీలను వ్యతిరేకించాలని, భూములు ఇవ్వవద్దని కరపత్రాల్లో పేర్కొన్నారు.
ఈ కరపత్రాలు లభ్యమైన వెంటనే గడ్చిరోలి–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు విస్తృత కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అడవి ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేసి, మావోయిస్టుల జాడ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
గడ్చిరోలికి ఆనుకుని ఉన్న తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. అంతర్‌రాష్ట్ర సరిహద్దుల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేసి, మావోయిస్టుల కదలికలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.
మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందనే అభిప్రాయాల మధ్య తాజాగా లభించిన ఈ కరపత్రాలు మరోసారి భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేశాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.







