Mahaa Daily Exclusive

  స‌హ‌కార రంగంలో సరికొత్త సంకేతాలు….

Share

*స‌హ‌కార రంగంలో సరికొత్త సంకేతాలు*

*నాన్-అఫీషియల్ పీఐసీ’ కమిటీ నియామ‌కాలు*

*వరంగల్ జిల్లా న‌ల్ల‌బెల్లితోనే షురూ..!*

*రాష్ట్ర రాజ‌కీయాల్లో స‌హ‌కార రంగం పై చ‌ర్చ‌*

*ఎమ్మెల్యేల సిఫారసులే కీలకమా.? ఆశావహుల్లో పెరిగిన పోటీ!*

*పీఏసీఎస్ కమిటీల నియామకం పై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ!*

మహా వ‌రంగ‌ల్ బ్యూరో ;

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ సహకార సంఘాల్లో లో సరికొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందుకు వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పరిణామాలు రాష్ట్రవ్యాప్త రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రస్తుత పర్సన్-ఇన్-ఛార్జ్ కమిటీని రద్దు చేసి, ప్రభుత్వం కొత్తగా ‘నాన్-అఫీషియల్ పీఐసీ’ కమిటీని నియమించడం సహకార రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. రుణాల వసూళ్లలో నిర్లక్ష్యం, ఆడిట్ అభ్యంతరాలు, నిధుల వినియోగంలో లోపాలను పేర్కొంటూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, రాష్ట్రంలోని మిగతా పీఏసీఎస్‌లకు కూడా ఓ హెచ్చరికగా భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్‌ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామ పంచాయతీలు, రెవెన్యూ గ్రామాల విభజనతో పాటు సభ్యత్వాల మార్పులు జరగాల్సి ఉండటంతో, ప్రస్తుతానికి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. సుమారు 900 కు పైగా ఉన్న పీఏసీఎస్‌లలో వేలాది నామినేటెడ్ పదవులు భర్తీ కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఎన్నికలు జరగనంత కాలం ‘పర్సన్-ఇన్-ఛార్జ్’ (పీఐసీ) కమిటీల ద్వారానే పరిపాలన సాగించాలనే ప్రభుత్వ నిర్ణయం, అధికార పార్టీలోని ఆశావహుల్లో ఆశలను రేకెత్తిస్తోంది.

*న‌ల్ల‌బెల్లితోనే షూరునా.?*

తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964లోని సెక్షన్ 32(7)(ఏ) ప్రకారం వరంగల్ జిల్లా నల్లబెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లో ఆడిట్ అభ్యంతరాలు, రుణాల వసూళ్లలో నిర్లక్ష్యం వంటి కారణాలతో ప్రస్తుత కమిటీని రద్దు చేసి, ప్రభుత్వం కొత్త ‘నాన్-అఫీషియల్ పర్సన్-ఇన్-ఛార్జ్ (పీఐసీ)’ కమిటీని నియమించింది. ఈ ప‌రిణామం రాష్ట్రవ్యాప్తంగా సహకార రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇది కేవలం ఒక సంఘానికి పరిమితమైన నిర్ణయం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా త్వరలో చేపట్టనున్న పీఏసీఎస్ నామినేటెడ్ కమిటీల నియామకాలకు, ముఖ్యంగా పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యే వరకు ఆయా సంఘాల పాలనను ఈ కమిటీలకే అప్పగించే ప్రభుత్వ విధానానికి సంకేతంగా సహకార, రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

పనితీరుపై ఆడిట్.. ప్రమాణాలు మారతాయా?

నల్లబెల్లి ఉదంతం నేపథ్యంలో రాబోయే రోజుల్లో నామినేటెడ్ కమిటీల నియామకానికి కేవలం రాజకీయ ప్రాధాన్యత మాత్రమే కాకుండా, ‘పనితీరు’ ప్రామాణికంగా ఉండబోతోందనే చర్చ జరుగుతోంది. రుణాల వసూళ్లు, ఆడిట్ నివేదికలు, రైతులకు అందుతున్న సేవలు, ఆర్థిక క్రమశిక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పదవులు కట్టబెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సహకార సంఘాలను కేవలం రాజకీయ పునరావాస కేంద్రాలుగా కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మలచాలనేది ప్రభుత్వ ఉద్దేశమని సహకార శాఖ వర్గాలు చెబుతున్నాయి.

*ముదురుతున్న రాజకీయాలు*

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 150కి పైగా సంఘాల్లో కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ల నియామకంపై పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్యేలు సూచించిన వారికే పదవులు దక్కుతాయన్న సంకేతాలతో నియోజకవర్గాల్లో పట్టు కోసం నేతలు పైరవీలు మొదలుపెట్టారు. సహకార రంగానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా, ఈ నియామకాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా, నల్లబెల్లి నిర్ణయం మిగతా జిల్లాల్లోని సహకార సంఘాలకు మార్గదర్శిగా మారుతుందా లేక కేవలం ఒకే చోటికి పరిమిత మవుతుందో వేచి చూడాల్సిందే.!