Mahaa Daily Exclusive

  ప్రభుత్వ పాఠశాలల్లో 3,900 కొత్త శౌచాలయాలు….

Share

ప్రభుత్వ పాఠశాలల్లో 3,900 కొత్త శౌచాలయాలు.
* రూ.1,650 కోట్లకు కేంద్రం ఆమోదం.
హైదరాబాద్, మహా.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ నిధులను ఆమోదించింది. సమగ్ర శిక్షా పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి మొత్తం రూ.1,650 కోట్లు మంజూరు చేయగా, ఇందులో 60 శాతం కేంద్రం వాటా ఉంటుంది. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త శౌచాలయాల నిర్మాణం, పాఠశాలల మరమ్మతులు, సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ గదులు, అక్షరాస్యత కార్యక్రమాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ వంటి పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల కొరతను యూడైస్ గణాంకాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించగా, సమగ్ర శిక్షా ప్రాజెక్టు ఆమోదిత మండలి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 3,900 కొత్త శౌచాలయాలు నిర్మించనున్నారు. వీటిలో 2,799 బాలురకు, 1,101 బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేస్తారు. ఒక్కో శౌచాలయ నిర్మాణానికి రూ.4.80 లక్షలు చొప్పున మొత్తం సుమారు రూ.187 కోట్ల వ్యయాన్ని కేంద్రం ఆమోదించింది.
ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ రూ.340 కోట్లు కేటాయించారు. ఇందులో అధిక భాగం శౌచాలయాల నిర్మాణానికే వెచ్చించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని 145 పాఠశాలల్లో ప్రధాన మరమ్మతుల కోసం రూ.9.70 కోట్లు మంజూరు చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన విజ్ఞాన బోధన అందించేందుకు 287 పాఠశాలల్లో సైన్స్ ప్రయోగశాలల నిర్మాణానికి రూ.71.75 కోట్లు కేటాయించారు. ఒక్కో ల్యాబ్ నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేయనున్నారు. అలాగే 24 పాఠశాలల్లో కంప్యూటర్ గదుల నిర్మాణానికి రూ.6 కోట్లు, ఇంటర్మీడియట్‌, పదకొండో, పన్నెండో తరగతి విద్యార్థుల కోసం 129 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కంప్యూటర్ గదుల నిర్మాణానికి రూ.20 కోట్లు కేటాయించారు.
నిజామాబాద్ జిల్లాలో 200 మంది విద్యార్థుల సామర్థ్యంతో హాస్టల్ నిర్మాణానికి రూ.8.25 కోట్లు మంజూరయ్యాయి. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే కేంద్రం విడుదల చేసే పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ స్థానం మరింత మెరుగుపడుతుందని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ తెలిపారు. ఇటీవల రాష్ట్రం 28వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరుకుందని ఆయన వెల్లడించారు.
సమగ్ర శిక్షా పథకం కింద ప్రాథమిక విద్యలో అక్షరాస్యత, గణిత నైపుణ్యాల పెంపు కోసం రూ.49.90 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల్లో ప్రాథమిక అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడమే దీని లక్ష్యం. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల నిర్వహణకు రూ.548 కోట్లు కేటాయించారు. పాఠశాలల సాధారణ నిర్వహణ కోసం స్కూల్ గ్రాంట్ల కింద రూ.72.87 కోట్లు, ఉచిత పాఠ్యపుస్తకాల కోసం రూ.51.39 కోట్లు, ఉచిత యూనిఫాంల కోసం రూ.98.21 కోట్లు మంజూరు చేశారు.
డిజిటల్ విద్యను బలోపేతం చేయడానికి కంప్యూటర్లు, డిజిటల్ విద్యా సదుపాయాల కోసం రూ.26.03 కోట్లు, ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వృత్తి విద్య అమలుకు రూ.26.69 కోట్లు కేటాయించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య కోసం రూ.27.11 కోట్లు, పాఠశాలలు అందుబాటులో లేని ప్రాంతాల విద్యార్థులకు రవాణా భత్యంగా రూ.16.97 కోట్లు మంజూరు చేశారు.
విద్యార్థుల్లో పఠన అలవాటును పెంపొందించేందుకు ‘రీడింగ్ మేళా’ కార్యక్రమానికి రూ.2.04 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని 20,825 పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ.1,000 చొప్పున అందించనున్నారు. అదేవిధంగా ఉన్నత తరగతుల విద్యార్థుల కోసం 372 బాలుర మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.16.34 కోట్లు, 91 బాలికల మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.3.37 కోట్లు ఖర్చు చేసేందుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.
విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం, ఆధునిక విద్యా సదుపాయాలు, నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో ఈ నిధులు కీలక పాత్ర పోషిస్తాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.