ఈనెల 20న ఇందిరమ్మ ఎల్ఐజీ గృహాలకు శ్రీకారం.
* మూడు రోజుల్లో విధివిధానాల వెల్లడి.
హైదరాబాద్, మహా.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఎల్ఐజీ గృహాల నిర్మాణానికి ఈ నెల 20న శ్రీకారం చుట్టనుంది. క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఈ గృహాలకు సంబంధించిన ఏర్పాట్లపై రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఎల్ఐజీ గృహాలకు సంబంధించి అర్హతలు, దరఖాస్తుల స్వీకరణ విధానం, ఎంపిక ప్రక్రియ, అమలు మార్గదర్శకాలను సమగ్రంగా రూపొందిస్తున్నామని తెలిపారు. మరో మూడు రోజుల్లో పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
తొలిదశలో ప్రతి నియోజకవర్గంలో అవసరాన్ని బట్టి 500 నుంచి 1,000 వరకు ఎల్ఐజీ ఫ్లాట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. నగర ప్రాంతాల్లో మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల కుటుంబాలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన గృహాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ పథకం కోసం గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో తగిన ప్రభుత్వ భూములను ఇప్పటికే గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఆధునిక వసతులతో కూడిన బహుళ అంతస్తుల గృహ సముదాయాలను నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
ఫ్లాట్ల విస్తీర్ణం, నమూనా రూపకల్పన, నిర్మాణ ప్రమాణాలు, ధరలు, లబ్ధిదారుల ఎంపిక విధానం తదితర వివరాలను కూడా మూడు రోజుల్లో ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నగరాల్లో సొంత ఇల్లు కలను సాకారం చేయాలనుకునే వేలాది కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.







