Mahaa Daily Exclusive

  యువతకు అండగా నిలుస్తాం…

Share

  • యువతకు అండగా నిలుస్తాం
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై మన్నె గోవర్ధన్ రెడ్డి నిప్పులు

హైదరాబాద్ , మహా :
“యూత్ డిక్లరేషన్” పేరుతో తెలంగాణ విద్యార్థులను, నిరుద్యోగ యువతను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు అదే యువతను ఘోర నిరాశలోకి నెట్టిందని ఖైరతాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా సరూర్‌నగర్‌లో నిర్వహించిన “యువ సంగ్రామ సదస్సు”లో ఖైరతాబాద్ నియోజకవర్గ నిరుద్యోగ యువతతో కలిసి మన్నె గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీలు, నిరుద్యోగ భృతి, నియామకాల భర్తీ, విద్యార్థుల సంక్షేమం వంటి కీలక వాగ్దానాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలను ఇప్పుడు పూర్తిగా మరచిపోయి, తెలంగాణ యువత ఆశలను, వారి ఉజ్వల భవిష్యత్తును వమ్ము చేసిందని ఆరోపించారు. యువత జీవితాలతో రాజకీయాలు చేసే ప్రభుత్వాలను ప్రజలు ఎన్నటికీ క్షమించరని పేర్కొంటూ, యువతకు ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యే వరకు బిఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ యువత హక్కుల కోసం, ఉద్యోగాల కోసం, న్యాయం కోసం ఈ పోరాటాన్ని రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర యువతకు అండగా నిలుస్తూ, వారి భవిష్యత్తు కోసం ప్రతి వేదికపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ సదస్సులో ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వారితో పాటు ఫిలింనగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకీ ముదిరాజ్, ఎర్రమంజిల్ డివిజన్ సీనియర్ నాయకులు నిశాంత్ ముదిరాజ్, బిఆర్ఎస్ వి నాయకులు నవీన్ నాయక్, ఖైరతాబాద్ డివిజన్ నాయకులు శ్రావణ్ మరియు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని సదస్సును విజయవంతం చేశారు.