Mahaa Daily Exclusive

  ఎల్‌నినో ప్రభావంపై రైతు కమిషన్‌తో నిపుణుల కమిటీ విస్తృత చర్చలు…

Share

ఎల్‌నినో ప్రభావంపై రైతు కమిషన్‌తో నిపుణుల కమిటీ విస్తృత చర్చలు.
* బీఆర్కే భవన్‌లో రైతు కమిషన్ కార్యాలయాన్ని సందర్శించిన డాక్టర్ జి. చిన్నారెడ్డి.

హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కార్యాచరణను వేగవంతం చేసింది. ఈ కమిటీ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి సోమవారం బీఆర్కే భవన్‌లోని తెలంగాణ రైతు కమిషన్ కార్యాలయాన్ని సందర్శించి కమిషన్ ప్రతినిధులతో విస్తృతంగా సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, వర్షాభావ ప్రభావం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, తీసుకోవాల్సిన తక్షణ మరియు దీర్ఘకాలిక చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, పంటలపై దాని ప్రభావం, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదికతో పాటు కార్యాచరణ సూచనలు అందించేందుకు డాక్టర్ జి. చిన్నారెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి కన్వీనర్‌గా వ్యవహరిస్తుండగా, వ్యవసాయం, వాతావరణం, జలవనరులు, అనుబంధ రంగాలకు చెందిన మొత్తం 25 మంది నిపుణులు సభ్యులుగా ఉన్నారు.

నిపుణుల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రైతు కమిషన్ కార్యాలయాన్ని సందర్శించిన డాక్టర్ చిన్నారెడ్డికి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, భవానీ రెడ్డి ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో రైతు కమిషన్ ఇప్పటివరకు చేపట్టిన అధ్యయనాలు, ప్రభుత్వానికి అందజేసిన సిఫార్సులు, వ్యవసాయ రంగంలో ప్రస్తుత పరిస్థితులపై రూపొందించిన విశ్లేషణాత్మక నివేదికలను కమిటీ చైర్మన్‌కు వివరించారు.

సమావేశంలో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు, సాగునీటి లభ్యత, పంటల మార్పిడి అవసరం, రైతులకు అందించాల్సిన సాంకేతిక సూచనలు, ముందస్తు జాగ్రత్తలు, ప్రభుత్వ సహాయక చర్యలపై సమగ్రంగా చర్చించారు. రైతు కమిషన్ ప్రభుత్వానికి అందిస్తున్న సూచనలు, సిఫార్సులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని డాక్టర్ చిన్నారెడ్డి అభిప్రాయపడుతూ కమిషన్ పనితీరును అభినందించారు.

ఈ సందర్భంగా ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, వర్షాభావ ప్రభావం, రైతులకు అవసరమైన ప్రత్యామ్నాయ వ్యవసాయ కార్యాచరణపై రైతు కమిషన్ సిద్ధం చేసిన రెండు సమగ్ర నివేదికలను డాక్టర్ చిన్నారెడ్డికి కమిషన్ ప్రతినిధులు అందజేశారు. వాటిని పరిశీలించి నిపుణుల కమిటీ సిఫార్సుల రూపకల్పనలో వినియోగిస్తామని ఆయన తెలిపారు.

ఈ నెల 22న ప్రజాభవన్‌లో నిపుణుల కమిటీ తొలి అధికారిక సమావేశం నిర్వహించనున్నట్లు డాక్టర్ చిన్నారెడ్డి వెల్లడించారు. ఆ సమావేశానికి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ, కమిషన్ రూపొందించిన నివేదికలు, సూచనలను కమిటీ ముందుంచాలని కోరారు.

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులను గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ చిన్నారెడ్డి పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర సిఫార్సులు అందించేందుకు నిపుణుల కమిటీ పనిచేస్తుందని తెలిపారు.

ఈ సమావేశంలో రైతు కమిషన్ ఇన్‌చార్జ్ మెంబర్ సెక్రటరీ సంధ్యారాణి, స్పెషల్ ఆఫీసర్ కేశవులు, వ్యవసాయ నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి, రైతు కమిషన్ అధికారులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.