Mahaa Daily Exclusive

  ఇథనాల్ మిశ్రమంతో ఆహార భద్రతకు ముప్పు లేదు….

Share

ఇథనాల్ మిశ్రమంతో ఆహార భద్రతకు ముప్పు లేదు.
* మిగులు ధాన్యంతోనే ఇథనాల్ తయారీ.
* ఈ 20కి మించి బ్లెండింగ్‌పై ఇంకా నిర్ణయం లేదని రాజ్యసభలో కేంద్రం స్పష్టీకరణ.
ఢిల్లీ, మహా.
దేశంలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం అమలుతో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇథనాల్ ఉత్పత్తి పూర్తిగా “వేస్ట్ టు వెల్త్” (వ్యర్థాల నుంచి సంపద) విధానానికి అనుగుణంగానే కొనసాగుతోందని, ప్రజల ఆహార అవసరాలకు ఎలాంటి భంగం కలగకుండా మిగులు ధాన్యాన్నే ఇందుకోసం వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే భూగర్భ జలాల వినియోగంపై వ్యక్తమవుతున్న సందేహాలను కూడా కొట్టిపారేసింది.

రాజ్యసభలో సోమవారం సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల దేశంలో ఆహార ధాన్యాల లభ్యతపై లేదా ఆహార భద్రతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS), జాతీయ ఆహార భద్రత చట్టం (NFSA) కింద అవసరమైన ధాన్యం, బఫర్ స్టాక్‌ల కోసం అవసరమైన నిల్వలను పూర్తిగా కేటాయించిన తర్వాత మిగిలే అదనపు ధాన్యాన్ని మాత్రమే ఇథనాల్ తయారీకి వినియోగిస్తున్నట్లు మంత్రి వివరించారు. అందువల్ల ఆహార ధాన్యాల కొరత ఏర్పడే పరిస్థితి లేదని పేర్కొన్నారు.

దేశంలో ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం ఇంధన దిగుమతులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించడం, రైతులకు అదనపు ఆదాయం కల్పించడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, వ్యర్థాలను విలువైన ఉత్పత్తులుగా మార్చడం వంటి లక్ష్యాలతో అమలు చేస్తున్న జాతీయ కార్యక్రమమని కేంద్రం వివరించింది. ఈ కార్యక్రమంలో వనరుల సమర్థ వినియోగానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది.

ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతం అమల్లో ఉన్న 20 శాతం స్థాయి (E20) కంటే పెంచే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సురేష్ గోపి స్పష్టం చేశారు. భవిష్యత్తులో E20 కంటే ఎక్కువ ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపాలన్న ప్రతిపాదన వస్తే, ముందుగా శాస్త్రీయ, సాంకేతిక అధ్యయనాలు నిర్వహించి, వాహన తయారీ సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, సంబంధిత పరిశోధనా సంస్థలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ, రైతుల ప్రయోజనాలు, వినియోగదారుల అవసరాలు, వాహనాల సాంకేతిక సామర్థ్యం వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే భవిష్యత్ విధాన నిర్ణయాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ వేదికగా స్పష్టం చేసింది.