సభ్యులంతా సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి.
• పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు శ్రీకారం.
• నిర్మాణాత్మక చర్చలకు ప్రధాని మోదీ పిలుపు..
ఢిల్లీ, మహా.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాల దృష్ట్యా ఉభయ సభల్లో నిర్మాణాత్మక చర్చలు జరగాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై సభ్యులంతా సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ప్రధాని, ఇటీవలి అంతరిక్ష విజయాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
భారత్ అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర సృష్టిస్తోందని, ఇటీవల భారత యువత స్థాపించిన ప్రైవేట్ స్టార్టప్ స్కైరూట్ విజయవంతంగా రాకెట్ ప్రయోగించడం దేశానికి గర్వకారణమని ప్రధాని పేర్కొన్నారు. ఆ సంస్థలో పనిచేస్తున్న యువ ఇంజినీర్ల సగటు వయస్సు కేవలం 28 సంవత్సరాలేనని చెబుతూ, “నేను మాట్లాడేది 28 ఏళ్ల యువత గురించి.. 56 ఏళ్ల యువకుడి గురించి కాదు” అని వ్యాఖ్యానించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
గత ఏడాది వర్షాకాల సమావేశాలకు ముందు భారతీయ వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయాన్ని గుర్తు చేసిన మోదీ, ఇప్పుడు భారత యువత రూపొందించిన ప్రైవేట్ రాకెట్ విజయవంతంగా ప్రయోగం కావడం దేశ సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనమని కొనియాడారు. ప్రపంచంలో చాలా కొద్ది దేశాలకే ఇలాంటి సామర్థ్యం ఉందని, భారత యువత ఆ జాబితాలో దేశాన్ని నిలబెట్టిందని అన్నారు.
ప్రస్తుత వర్షాకాలం వ్యవసాయ రంగానికి ఎంత కీలకమో, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దేశ ప్రజాస్వామ్యానికి అంతే ముఖ్యమని ప్రధాని పేర్కొన్నారు. మంచి వర్షాలు ఎలా ప్రజలకు మేలు చేస్తాయో, ఉత్పాదకంగా జరిగే పార్లమెంట్ సమావేశాలు కూడా దేశాభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై సార్థకమైన చర్చలు జరిగి, దేశ ప్రయోజనాలకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడాలని ఆకాంక్షించారు.
ఇదిలా ఉండగా, వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ఇప్పటికే వ్యూహాన్ని సిద్ధం చేశాయి. అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలు, నీట్–యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ, విద్యార్థుల ఆందోళనలు, నిరుద్యోగం, ప్రజా సమస్యలు వంటి అంశాలపై చర్చకు పట్టుబట్టనున్నాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ రూల్–267 కింద బిజినెస్ సస్పెన్షన్ నోటీసు ఇవ్వగా, కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా లోక్‌సభలో అడ్జర్న్‌మెంట్ మోషన్ నోటీసు సమర్పించారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తొలి రోజు నుంచే వాగ్వాదం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆగస్టు 13 వరకు కొనసాగనున్న ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ సుప్రీంకోర్టు (సవరణ) బిల్లు–2026ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కు పెంచే ప్రతిపాదనకు చట్టబద్ధత కల్పించనున్నారు. దీనితో పాటు ప్రశ్నోత్తరాల సమయం, సంతాప తీర్మానాలు, మంత్రుల ప్రకటనలు, వివిధ శాఖల నివేదికలను సభ ముందు ఉంచనున్నారు.
రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేషనల్ హానర్ (సవరణ) బిల్లు–2026ను ప్రవేశపెట్టనున్నారు. జాతీయ గీతం వందేమాతరంకు అవమానం కలిగించడం లేదా ఆలపించకుండా అడ్డుకోవడాన్ని శిక్షార్హమైన నేరంగా ప్రకటించేలా ఈ బిల్లులో నిబంధనలు ప్రతిపాదించారు. అలాగే గత సమావేశాల అనంతరం తీసుకొచ్చిన సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ ఆర్డినెన్స్–2026, ఆదాయపు పన్ను (సవరణ) ఆర్డినెన్స్–2026లను కూడా రాజ్యసభ ముందు ఉంచనున్నారు.
ఈ సమావేశాల ద్వారానే ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన 20 మంది ఎంపీలతో ఏర్పడిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ) పార్లమెంటులో తొలి అడుగు పెట్టనుంది. కొత్త రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ పార్టీ వైఖరిపైనా ఆసక్తి నెలకొంది.
పార్లమెంట్ తొలి రోజే ప్రభుత్వ అజెండా, ప్రతిపక్షాల దూకుడు స్పష్టమవడంతో రానున్న వారాల్లో నీట్ వివాదం, అయోధ్య విరాళాల ఆరోపణలు, చట్టసవరణ బిల్లులు, జాతీయ అంశాలపై ఉభయ సభల్లో తీవ్ర చర్చలు, వాగ్వాదాలు కొనసాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.







