ఎల్ నినో ముప్పును దాటుతూ.. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు.
* క్షేత్రస్థాయిలో ఎన్ఎస్పీ కాలువలను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో నెలకొన్న ‘ఎల్ నినో’ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఖమ్మం జిల్లా ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కోకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన కార్యాచరణను చేపట్టింది. అందులో భాగంగా జిల్లాకు చేరుకుంటున్న గోదావరి జలాలను గురువారం నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లావాసులకు ఎండాకాలంలో ఎలాంటి నీటి ఇబ్బందులు రాకుండా చూడాలని గత సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు జారీ చేసిన ఆదేశాల మేరకు యంత్రాంగం వేగంగా స్పందించి నీటి తరలింపు ప్రక్రియను ముమ్మరం చేసింది.
భద్రాచలం వద్ద ఉన్న దుమ్ముగూడెం నుంచి రాజీవ్ కాలువ ద్వారా గోదావరి వెనుక జలాలను నాగార్జునసాగర్ (ఎన్ఎస్పీ) మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా నేరుగా వైరా చెరువుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్ఎస్పీ మెయిన్ బ్రాంచ్ కాలువకు వేగంగా వస్తున్న గోదావరి జలాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా పరిశీలించి, నీటి ప్రవాహాన్ని అంచనా వేశారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఏ విధంగా జిల్లాలోని ఎన్ఎస్పీ కాలువల గుండా ప్రవహిస్తూ రిజర్వాయర్లను చేరుకుంటున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగర్ మెయిన్ బ్రాంచ్ ద్వారా గోదావరి జలాలు వైరా చెరువుకు చేరుతుండటంతో ఖమ్మం జిల్లా ప్రజలకు, రైతులకు పెద్ద ఊరట లభించినట్లయింది.
ఈ పర్యటనలో భాగంగా తనికెళ్ల గ్రామ సమీపంలోని ఎన్ఎస్పీ మెయిన్ కాలువ గేట్ల వద్దకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రికి స్థానిక సర్పంచ్ గడల కళావతి ఘన స్వాగతం పలికారు. ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరించారు. గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను నివేదించడానికి సర్పంచ్ సమయం కోరగా, భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎన్ఎస్పీ, ఇరిగేషన్ అధికారులతో సుమారు 15 నిమిషాల పాటు ఆయన అక్కడే సమీక్ష నిర్వహించారు. ఎల్ నినో ప్రభావం ఎంత ఉన్నప్పటికీ, జిల్లాలోని ఏ ఒక్క గ్రామంలోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా గోదావరి జలాలతో త్వరితగతిన ప్రధాన చెరువులన్నింటినీ నింపాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎంతో శ్రమించి జిల్లాకు రప్పించిన ఈ జలాలను ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాదుల సారంగపాణి, సుడా చైర్మన్ పువాళ్ల దుర్గాప్రసాద్, ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసచారి, ఎన్ఎస్పీ సీఈ, ఎస్ఈ, డీఈ, ఏఈ స్థాయి అధికారులు పాల్గొన్నారు.







