తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం.
* కేసీఆర్‌తో పాటు మాజీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకూ ప్రాధాన్యం.
* ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె. కేశవరావు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె. కేశవరావు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, గత 16 రోజులుగా వివిధ ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు నిర్వహించినట్లు వెల్లడించారు.
ఉద్యమకారులను ఏ ప్రాతిపదికన గుర్తించాలి, వారికి ఎలాంటి గౌరవం కల్పించాలి అనే అంశాలపై అన్ని రాజకీయ పార్టీల నుంచి విలువైన సూచనలు స్వీకరించినట్లు కేశవరావు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీలు స్వాగతించాయని పేర్కొన్నారు. వివిధ సంఘాల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలను క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక రూపంలో సమర్పిస్తామని స్పష్టం చేశారు.
ఈ సంప్రదింపుల సమావేశాలకు సుమారు 13 వేల మంది హాజరయ్యారని, దాదాపు వెయ్యి మంది తమ సూచనలు లిఖితపూర్వకంగా అందజేశారని ఆయన వెల్లడించారు. అయితే సంప్రదింపుల ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని, ఆన్‌లైన్ ద్వారా కూడా ఉద్యమకారులు, సంఘాల అభిప్రాయాలు స్వీకరించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటించి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం దక్కేలా కమిటీ బాధ్యతాయుతంగా పనిచేస్తుందని కేశవరావు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, త్వరలోనే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించి ఉద్యమకారులు, సంఘాలతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును గౌరవిస్తామని, ఆయన్ను కూడా ఈ చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పనిచేసిన అప్పటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకుంటామని వెల్లడించారు. డిసెంబర్‌లోపు కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అద్దంకి దయాకర్ తెలిపారు.







