Mahaa Daily Exclusive

  ఎల్‌నినోతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం….

Share

ఎల్‌నినోతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం.
* ప్రతి వర్షపు చుక్కను కాపాడుకోవాలి.
* మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట, మహా.
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఐఓసీ కార్యాలయంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఎల్‌నినో ప్రభావంపై సమీక్ష నిర్వహించిన ఆయన, పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల అధికారులు హాజరయ్యారు.
గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. భవిష్యత్తులో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరించారు. వచ్చే ఏడాది జూన్ వరకు సాధారణ వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్న నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
పశువులకు మేత కొరత ఏర్పడకుండా రైతుల్లో అవగాహన కల్పించాలని, కరవు పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి పంటల సాగుపై రైతులకు సూచనలు ఇవ్వాలని మంత్రి చెప్పారు. భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయని, వాటి మట్టాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతలు తవ్వడం వంటి నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షం కురిసే ప్రతి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని, నీటి వనరుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.