బెంగళూరు, మహా.
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తదుపరి ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ)గా ఆశిష్ కుమార్ దాస్‌ను బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని సంస్థ గురువారం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆయన సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సీఈఓగా కొనసాగుతున్న సలీల్ పరేఖ్ పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనుంది. దాదాపు తొమ్మిదేళ్లుగా ఆయన ఇన్ఫోసిస్‌కు నాయకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ఆశిష్ కుమార్ దాస్ ఇన్ఫోసిస్‌లో ఎనర్జీ వర్టికల్‌తో పాటు పలు కీలక వ్యాపార విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు. సంస్థలో ఆయనకు సుమారు 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో సాఫ్ట్‌వేర్ పరిశ్రమ వేగంగా మారుతున్న నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలపై లోతైన అవగాహన, సాంకేతిక నైపుణ్యం కలిగిన ఆశిష్‌కు సీఈఓ బాధ్యతలు అప్పగించాలని బోర్డు నిర్ణయించినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.
ఆశిష్ కుమార్ దాస్ నియామకంపై ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని స్పందిస్తూ, తదుపరి సీఈఓ ఎంపిక విషయంలో బోర్డుకు మొదటి నుంచే స్పష్టమైన దృష్టి ఉందన్నారు. ఇన్ఫోసిస్ విశ్వసనీయత, విలువలను కొనసాగిస్తూనే సంస్థలో సాహసోపేత మార్పులను తీసుకురాగల నాయకత్వం అవసరమని భావించామని తెలిపారు. వ్యాపార నిర్వహణలో ఆయనకు ఉన్న అనుభవం, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సంస్థను మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.







