ఢిల్లీ, మహా.
ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలో లోపాలపై జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వం నేరుగా చర్చలు జరపాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు. విద్యార్థులు ప్రస్తుత వ్యవస్థపై విశ్వాసం కోల్పోయారని, వారి ఆందోళనలను ప్రభుత్వం వెంటనే ఆలకించాలని ఆమె కోరారు.
విద్యార్థుల డిమాండ్లను వినాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. అరకొర పరిష్కారాలతో విద్యార్థులను సంతృప్తిపరచడం ఇక సాధ్యం కాదని పేర్కొన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నిరసన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, దాడుల ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
సోషల్ మీడియాలో విద్యార్థుల పట్ల మద్దతు ప్రకటిస్తూ, మరోవైపు రాత్రివేళ వారిపై పోలీసు చర్యలు చేపట్టడం విరుద్ధ వైఖరికి నిదర్శనమని ప్రియాంక గాంధీ విమర్శించారు. విద్యార్థుల సంక్షేమంపై నిజంగా శ్రద్ధ ఉంటే వారిని చర్చలకు ఆహ్వానించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ తీరును వివరిస్తూ, “పిల్లలు డిజైనర్ కావాలనుకుంటే వారి మాట వినకుండా ఇంజినీరింగ్ కళాశాలలో సీటు బుక్ చేశానని చెప్పే తండ్రిలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది” అంటూ వ్యాఖ్యానించారు.
జంతర్‌మంతర్ వద్ద వేలాదిగా ఆందోళన చేస్తున్న యువత ఆవేదనను రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణల కోసం కొత్త చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా స్పందించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ హామీలపై ప్రజల్లో విశ్వాసం తగ్గిందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తప్పించి, అనంతరం విద్యార్థులతో చర్చలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.







