Mahaa Daily Exclusive

  క్రీడా రంగానికి సీఐఎస్‌ఎఫ్ అండ….

Share

క్రీడా రంగానికి సీఐఎస్‌ఎఫ్ అండ.
* క్రీడా శక్తిగా భారత్ లక్ష్యానికి కేంద్రం అడుగులు.
* 332 మంది క్రీడాకారులకు సీఐఎస్‌ఎఫ్‌లో ఉద్యోగాలు.
* మహిళా అథ్లెట్లకు పెద్దపీట, క్రీడలకు రూ.4,800 కోట్ల బడ్జెట్ కేటాయింపు.
* కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.
ఢిల్లీ, మహా.
దేశంలోని కీలక మౌలిక వసతుల భద్రతకే పరిమితం కాకుండా భారత క్రీడా రంగాన్ని బలోపేతం చేయడంలో కూడా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) కీలక పాత్ర పోషిస్తోందని
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా సీఐఎస్‌ఎఫ్ పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తోందని వెల్లడించింది.

ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నడూ లేనివిధంగా నిర్వహించిన ప్రత్యేక క్రీడా నియామకాల్లో 332 మంది క్రీడాకారులను సీఐఎస్‌ఎఫ్‌లో నియమించినట్లు తెలిపింది. వీరిలో రికార్డు స్థాయిలో 179 మంది మహిళా అథ్లెట్లు ఉండగా, మహిళల కోసం కొత్తగా 21 క్రీడా జట్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. మహిళా క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించడంతో పాటు క్రీడల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

క్రీడాకారుల సంక్షేమానికి కూడా సీఐఎస్‌ఎఫ్ ప్రాధాన్యం ఇస్తోందని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యక్ష ఆర్థిక సహాయం, మెరుగైన పోషకాహారం, ఆధునిక క్రీడా సామగ్రి, నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ అథ్లెట్లకు సమగ్ర మద్దతు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

దేశవ్యాప్తంగా పోలీసు విభాగాల క్రీడా ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో నిర్వహిస్తున్న 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ చాంపియన్‌షిప్–2026కు సీఐఎస్‌ఎఫ్ విజయవంతంగా ఆతిథ్యం ఇస్తోందని తెలిపింది. ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర బలగాలకు చెందిన 36 జట్లు, 1,600 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నట్లు పేర్కొంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో క్రీడా రంగానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో క్రీడల కోసం దాదాపు రూ.4,800 కోట్ల నిధులను కేటాయించడం ద్వారా క్రీడా అభివృద్ధిపై ప్రభుత్వ నిబద్ధత మరోసారి స్పష్టమైందని పేర్కొంది. గత సంవత్సరాలతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని వివరించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో భారత్‌ను 2036 నాటికి ప్రపంచంలోని తొలి 10 క్రీడా శక్తులలో ఒకటిగా, 2047 నాటికి తొలి ఐదు క్రీడా దేశాల్లో ఒకటిగా నిలపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొంది. క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, యువ క్రీడాకారులకు ప్రోత్సాహం, అంతర్జాతీయ స్థాయి అవకాశాల కల్పన ద్వారా భారత క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేసింది.