భూమన ఆక్రమిత భూముల స్వాధీనానికి ప్రభుత్వం చర్యలు.
* స్వర్ణముఖి తీరం వద్ద ప్రహరీల తొలగింపు.. భారీ పోలీసు బందోబస్తు.
తిరుపతి, మహా.
తిరుచానూరు పరిధిలోని స్వర్ణముఖి నది తీరంలో వైసీపీ నేత, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆక్రమించారనే ఆరోపణలు ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రెవెన్యూ అధికారులు గురువారం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమిత ప్రాంతాల్లో ప్రహరీ గోడలను జేసీబీలతో తొలగిస్తూ భూముల స్వాధీన ప్రక్రియ చేపట్టారు.
అధికారుల వివరాల ప్రకారం, సర్వే నంబర్ 47/1లోని 5.1 ఎకరాలు, సర్వే నంబర్ 47/5లోని 3.7 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే చర్యలు కొనసాగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న భూముల వద్ద “ఇది ప్రభుత్వ భూమి” అంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వందలాది మంది పోలీసులతో భద్రత కల్పించారు.
ఈ సందర్భంగా భూముల పరిస్థితిని పరిశీలించేందుకు ఏపీ సాధు పరిషత్‌కు చెందిన స్వాములు అక్కడికి చేరుకోగా, భద్రతా కారణాల దృష్ట్యా వారిని పోలీసులు ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు. అనంతరం వారు దూరం నుంచే మీడియాతో మాట్లాడారు.
ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రజలు భూమనకు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.
ఏపీ సాధు పరిషత్ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణ మాట్లాడుతూ, ఆక్రమిత భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సంబంధిత రెవెన్యూ రికార్డులను కూడా సవరించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై ఇదే తరహా చర్యలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వ భూములను ఆక్రమించారని, రెవెన్యూ అధికారులు, పోలీసులను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.








