Mahaa Daily Exclusive

  మానవ-ఏనుగు సంఘర్షణలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం…

Share

మానవ-ఏనుగు సంఘర్షణలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం.
• గుచ్చిమి కుంకీ ఏనుగుల శిబిరాన్ని ప్రజలకు అంకితం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

అమరావతి, మహా.

వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని, మానవ-ఏనుగు సంఘర్షణలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో గుచ్చిమి కుంకీ ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. బుధవారం వర్చువల్ విధానంలో గుచ్చిమి కుంకీ ఏనుగుల శిబిరాన్ని ప్రారంభించిన ఆయన, ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్దాలుగా కొనసాగుతున్న మానవ-ఏనుగు ఘర్షణలకు శాస్త్రీయ పరిష్కారంగా ఈ ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియాను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.

అటవీ ప్రాంతాల నుంచి ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశించి పంటలను ధ్వంసం చేయడంతో పాటు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న పరిస్థితులు చాలాకాలంగా కొనసాగుతున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఉందని, ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా స్థానిక రైతులు, ప్రజలు ఈ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రజల ప్రాణాలు, రైతుల పంటలను రక్షించడం ప్రభుత్వ బాధ్యతగా భావించి ఆధునిక సాంకేతికతతో గుచ్చిమి ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియాను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఉత్తరాంధ్రలో మానవ-ఏనుగు సంఘర్షణల నివారణలో ఈ కేంద్రం ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మనుషులు, ఏనుగులు పరస్పర సామరస్యంతో జీవించే పరిస్థితులను కల్పించడంలో గుచ్చిమి కుంకీ ఏనుగుల శిబిరం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అందుకే ఈ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రజలు అందించిన సహకారాన్ని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని గౌరవించి నాలుగు కుంకీ ఏనుగులను ఎంతో ఆప్యాయతతో ఆంధ్రప్రదేశ్‌కు పంపించడం వారి స్నేహభావానికి నిదర్శనమని కొనియాడారు. ఏనుగులను అందించడం అంటే తమ సంపదను పంచుకున్నట్టేనని కర్ణాటక ప్రజలు భావిస్తారని పేర్కొన్నారు. అలాంటి విలువైన సహకారాన్ని తెలుగు ప్రజల భద్రత కోసం అందించిన కర్ణాటక ప్రభుత్వం, అక్కడి ప్రజలకు రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల భద్రతకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శాస్త్రీయ విధానాలు, ఆధునిక సాంకేతికత వినియోగంతో అటవీ ఏనుగుల సమస్యకు సమర్థవంతమైన పరిష్కారాలు అమలు చేస్తామని తెలిపారు.

గుచ్చిమి కుంకీ ఏనుగుల శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె. అచ్చెన్నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అటవీ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.